దుబ్బాక, సెప్టెంబర్ 3: కాళేశ్వరంతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌పై కాంగ్రెస్ బురద రాజకీయాలకు పాల్పడటం, కక్షపూరితంగా వ్యవహరిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించడం సిగ్గుచేటని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్‌లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం జలాలతో కేసీఆర్, హరీశ్‌రావు చిత్రపటాలకు జలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘జై కేసీఆర్’, ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, బీజేపీ కుట్రలను ఎదుర్కొనే దమ్ము కేసీఆర్‌కు ఉందని అన్నారు.
ఎన్ని విచారణలు వేసినా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. కేసీఆర్‌కు కేసులు కొత్త కాదని, 14 ఎండ్ల తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. మేడిగడ్డకు మరమ్మతు చేయకుండా ప్రాజెక్టు కూలిపోయిందని, లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రాజెక్టుకు మరింత గౌరవం తేవాల్సిన బాధ్యతను మరిచి కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేయడం బాధాకరమని మండిపడ్డారు.
యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా కాళేశ్వరంపై సీబీఐ విచారణ పేరిట పొలిటకల్ డైవర్షన్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదని మాట్లాడిన మంత్రి ఉత్తమ్‌కుమార్ మల్లన్న సాగర్ రావాలని సూచించారు. దుబ్బాకను మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనని ప్రశంసించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మనోహర్‌రావు, వెంకటనర్సింహారెడ్డి, రాంరెడ్డి, ఎల్లారెడ్డి, శేఖర్‌గౌడ్, సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.