నాంపల్లి కోర్టు, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి యూకే పర్యటనకు అనుమతిస్తూ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా విదేశీ టూర్‌కు అనుమతి ఇచ్చారు. కేసుల నేపథ్యం లో దేశం విడిచి వెళ్లొద్దంటూ గతంలో బెయిల్ మంజూరు చేసిన సమయం లో కోర్టు షరతులు విధించింది.
విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఇటీవల ఇద్దరి తరఫున వేసిన పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశా యి. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు కుటుంబ సమేతంగా యూకేలో గడిపేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమ్మకంతో అనుమతివ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. నెలపాటు విదేశీ టూర్‌కు అనుమతిని కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి తరఫున దాఖలైన పిటిషన్‌ను సైతం కోర్టు అంగీకరించింది.