హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇద్దరు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. గత అక్టోబర్ 5న జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి, అతడి కుటుంబసభ్యుల నుంచి కస్టమ్స్ క్లియరెన్స్ కోసం రూ.50,000 లంచం డిమాండ్ చేశారు. అధికారులు ఒత్తిడి పెట్టడంతో ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చి, ఆ తర్వాత సీబీఐని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం సీబీఐ అధికారులు హైదరాబాద్, ముజఫర్‌పూర్(బీహార్), మాన్సా (పంజాబ్)లోని 5 చోట్ల కస్టమ్స్ అధికారుల ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసి రూ.4.76 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ అధికారులు వినయ్ కుమార్, ముఖేశ్కుమార్గా గుర్తించారు. వీరితో పాటు కెనరా బ్యాంక్ అధికారి సంతోష్‌కుమార్ పైనా కేసు నమోదుచేశారు.