హైదరాబాద్, ఫిబ్రవరి21 (నమస్తే తెలంగాణ): నదీజలాల వినియోగంలో తొలుత బేసిన్ అవసరాలకే ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాత మిగులు జలాలు ఉంటేనే బేసిన్ అవతలి ప్రాంతాలకు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల ప్రకారం తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయడంపై ట్రిబ్యునల్ జరుపుతున్న విచారణ శుక్రవారం కూడా కొనసాగింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదన వినిపించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డుతోపాటు తమిళనాడు, కర్ణాటక కేసులపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ పలు అంశాలను ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్రకు నివేదించారు.
నదీ పరివాహక ప్రాంతంలో లభ్యమయ్యే నీటిని తొలుత ఇన్-బేసిన్ అవసరాలను తీర్చేందుకు ఉపయోగించాలని, ఆ తర్వాత మిగులు నీరుంటేనే ఇతర అవసరాలకు మళ్లించాలని కావేరి ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అదే ప్రతిపాదనను కృష్ణా బేసిన్లోనూ అమలు చేయాలని పేర్కొన్నారు. కావేరి ట్రిబ్యునల్ సూచించినట్టుగా, సుప్రీంకోర్టు సమర్థించినట్టుగా దీర్ఘకాలిక పంటలను స్వల్పకాలానికి తగ్గించాలని, ఏపీ ఇప్పటికే ఉన్న అవసరాలకు నీటిని డిమాండ్ చేస్తున్నదని, తెలంగాణ కొత్త ప్రాంతాలకు నీటిని కేటాయించాలని కోరుతున్నదని వివరించారు. నీటి సమాన పంపిణీ సూత్రాన్ని అవలంబించడం ద్వారా అసమతుల్యతలను తగ్గించాలని, బేసిన్ పారామితుల ఆధారంగా 811 టీఎంసీల్లో 71% తెలంగాణకు కేటాయించాలని కోరారు.
ప్రస్తుతం ఏపీలో పెన్నా, గుండ్లకమ్మ తదితర బేసిన్లకు అదనపు నీటి వనరులు సమకూరాయని, అంతేకాకుండా పోలవరం నుంచి నాగార్జునసాగర్ కుడి కాలువకు, ఆ తర్వాత 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లేపల్లి రిజర్వాయర్‌కు, ఆపై బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు 200 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించేందుకు ఏపీ ప్రణాళికలను రూపొందించిందని ట్రిబ్యునల్‌కు వివరించారు. పెన్నా బేసిన్లో 228 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యాన్ని సృష్టించిందని, ఇతర బేసిన్లను కలుపుకుని మొత్తంగా 360 టీఎంసీల నిల్వసామర్థ్యం ఏపీకి ఉన్నదని ట్రిబ్యునల్‌కు నివేదించారు. ఏపీ ఇప్పటికీ బేసిన్ వెలుపలున్న ప్రాంతాలకు మాత్రమే అదనపు జలాలను కోరుతున్నదే తప్ప బేసిన్ పరిధిలోని ప్రాంతాలకు కాదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కనీసం ఒక్క పంటకు కూడా నీరు అందని కొత్త ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని నొకిచెప్పారు. ఎకువ నీరు అవసరమయ్యే వరి, చెరకు లాంటి పంటల సాగు కోసం కాకుండా ఎండిపోయిన పంటలకు తెలంగాణ నీటిని కోరుతున్నదని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు.
విచారణ మార్చి24వ తేదీకి వాయిదా
తెలంగాణ తరపున గత మూడు రోజుల నుంచి కొనసాగించిన వాదనలను వైద్యనాథన్ శుక్రవారంతో ముగించారు. దీంతో తదుపరి విచారణను మార్చి 24 నుంచి 26 వరకు చేపట్టనున్నట్టు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ప్రకటించారు. తాజా విచారణకు తెలంగాణ తరపున వైద్యనాథన్తోపాటు ఇతర న్యాయవాదులు, ఈ-ఇన్-సీఎం విజయభాసర్‌రెడ్డి, ఇంజినీర్లు సల్లా విజయ్‌కుమార్, రవిశంకర్, వెంకటనారాయణ, ఏపీ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్‌గుప్తా, ఇతర న్యాయవాదులు, ఇంజినీర్లు హాజరయ్యారు.