Palvancha | పాల్వంచ రూరల్/సారపాక, సెప్టెంబర్ 4 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని దంతెలబోర గ్రామం వద్ద కిన్నెరసాని, ముర్రేడు వాగులు కలిసే చోట ఏడుగురు పశువుల కాపరులు బుధవారం వరద నీటిలో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల్వంచ, బూర్గంపాడు మండలాల రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి రక్షణ చర్యలు చేపట్టారు. పశువులకాపరుల్లో ఉప్పుసాకకు చెందిన జారే సాయికృష్ణ గల్లంతు కాగా, మిగతా వారు క్షేమంగా ఒడ్డుకు చేరారు.
దంతెలబోర, గంగదేవిగుప్ప, ఉప్పుసాక ప్రాంతాలకు చెందిన దాదాపు 90మేకలు, పశువులు మేత కోసం దంతెలబోర నుంచి వాగులోకి వెళ్లాయి. ఆ సమయంలో కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి 53 వేల క్యూసెక్కుల నీరు వెళ్తున్నది. పశువులను తోలుకుని వచ్చేందుకు పశువుల కాపరులు వెళ్లిన సమయంలోనే ముర్రేడు వాగు ఉధృతి పెరిగి వారిని చుట్టుముట్టింది. సమాచారం తెలుసుకున్న దంతెలబోరవాసులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.
పశువుల కాపరుల్లో దంతెలబోరకు చెందిన తటుకుల కేదారి, దేశబోయిన ఈశ్వరయ్య, మంచినీళ్ళ ముసలయ్య, గంగదేవిగుప్పకు చెందిన కుంజా భద్రయ్య, ఇర్పా నగేశ్, మసం కళ్యాణ్, ఉప్పుసాకకు చెదిన జారేసాయి కృష్ణ ఉన్నారు. కలెక్టర్‌తోపాటు రెవెన్యూ, పోలీస్ అధికారులు సంగం వైపు, బూర్గంపాడు అధికారులు సోంపేట వద్ద బోట్లు, పడవలు, తాళ్ళతో రక్షణ చర్యలు ప్రారంభించారు. కిన్నెరసాని గేట్లను మూయించి నీటి విడుదలను ఆపేశారు. ముగ్గురు కాపరులు ఈత కొట్టుకుంటూ సంగం వైపు వస్తుండగా.. సాయికృష్ణ గల్లంతయ్యాడు. మరో నలుగురు తాళ్లసాయంతో బూర్గంపాడు మండలం సోంపేటకు చేరుకున్నారు. గల్లంతైన సాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.