హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు అటవీశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. శుక్రవారం నుంచి ‘క్యాచ్ ద ట్రాప్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ఈ ప్రత్యేక డ్రైవ్లో వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించడం ద్వారా వేటగాళ్లను గుర్తిస్తారు. వేటగాళ్లు వాడే పరికరాలను స్వాధీనం చేసుకోవడం, గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేస్తారు. అడవి సమీప ప్రాంతాలను, వ్యవసాయ క్షేత్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.
అత్యుత్తమ పనితీరు కనబరిచే క్షేత్రస్థాయి సిబ్బందికి సరైన ప్రోత్సాహం కల్పిస్తారు. ఇన్ఫార్మర్లను, వారి గుర్తింపును రహస్యంగా ఉంచడంతోపాటు వారికి తగిన రివార్డులు ఇవ్వనున్నారు. చట్ట విరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువులకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 98033 38666, టోల్ ఫ్రీ సంబర్ 1800 4255364కు తెలపాలని అటవీశాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వెల్లడించారు. రాష్ట్రంలో వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషం, పేలుడు పదార్థాలు మొదలైన వాటిని ఉపయోగించి అటవీ జంతువులను చంపడం, వేటాడటాన్ని అటవీశాఖ నిషేధించింది. వన్యప్రాణులను చంపడం, వేటాడే ప్రయత్నాలనూ నిరోధించాలని నిర్ణయించింది.