హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొన్నివర్గాల చేతుల్లోనే భూమి కేంద్రీకృతమైంది. అత్యధిక భూముల వాటాను ఆ వర్గాలే సొంతం చేసుకొన్నాయి. భూయాజమాన్య వాటాలు కులాలను బట్టి ఎక్కువ, తక్కువలు ఉన్నట్టు తేటతెల్లమైంది. బలమైన వర్గాలకే భూముల వాటా ఎక్కువగా ఉన్నదని తేలింది. బలమైన, సంప్రదాయంగా వ్యవసాయం, వ్యాపార రంగాల్లో ఎప్పటినుంచో ఉంటూ వస్తున్న ఓసీలు భారీగా భూములను కలిగి ఉన్నట్టు సీప్ (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల)-2024 సర్వేలో వెల్లడైంది. ఆయా కులాల జనాభాతోపాటు వారి భూముల వాటా వివరాలను ఈ సర్వేలో పొందుపర్చారు. ఈ నివేదిక ప్రకారం ఓసీ వర్గాల్లో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం, బీసీల్లోని యాదవ, మరో ఓసీ వర్గానికి చెందిన వెలమ వంటి కులాలు తమ జనాభా వాటాతో పోలిస్తే అధిక భూ యాజమాన్య వాటాను కలిగి ఉన్నాయి.
ఎస్టీ కోయ, బీసీ-డీ వీరశైవ, బీసీ-బీ కురుమ వంటి కులాల్లో భూములు అత్యల్ప తక్కువ వాటాతో ఉన్నట్టు స్పష్టమైంది. బీసీ మున్నూరుకాపు వర్గం బీసీల్లో బలమైన భూముల వాటా కలిగి ఉన్నది. ఎస్సీ మాదిగ, బీసీ-డీ ఆరెకటిక, బీసీ-డీ దూదేకుల, బీసీ-ఏ పిచ్చకుంట్ల వంటి కులాలు భూములు, ఆస్తుల యాజమాన్య హక్కుల్లో చాలా వెనుకబాటుతనంతో ఉన్నాయి. ఓసీ ముస్లింలు కూడా రాష్ట్ర సగటు కంటే వెనుకబడి ఉన్నారు. 56 ప్రధాన కులాల మధ్య భూమి, ఆస్తుల యాజమాన్య వాటాల్లో స్పష్టమైన అసమానతలు కనిపించాయి. ఇది మరోసారి రాష్ట్రంలో కులాలవారీగా ఆర్థిక, ఆస్తుల పరమైన అసమానతలను ధ్రువీకరించింది.
స్వల్పంగా అధిక వాటా
బీసీ-డీ జాబితాలోని మాలి వర్గం 0.2 శాతం జనాభా ఉంటే.. వారి భూమి వాటా శాతం 0.4 శాతంగా స్వల్పంగా ఎక్కువగా ఉన్నది. ఎస్టీ కొలం వర్గాల జనాభా 0.2 శాతమైతే వారి భూమి వాటా 0.4 శాతంగా నమోదు కావడం గమనార్హం. బీసీ-డీ వంజర కులానికి చెందిన జనాభా 0.2 శాతం కాగా, వారి భూమి వాటా 0.3 శాతంగా ఉన్నది.
అత్యధిక భూముల వాటా కలిగిన వర్గాలివే..
కులాలు వాటా (శాతం)