ఖైరతాబాద్, సెప్టెంబర్ 11 : ఈ నెల 25న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు లక్షలాది మంది బీసీలతో కులగణన మార్చ్ చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కులగణనపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమగ్ర కులగణన చేపట్టి 42శాతం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ స్వరం మార్చిందని, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే, త్వరితగతిన కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశ్ చారి, బాలరాజు గౌడ్, శ్యాంసుందర్, శ్రీనివాస్, మణిమంజరి తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 11 : ప్రభుత్వం ఈ ఏడాది చేప పిల్లల పంపిణీని 50 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదని, దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని ముదిరాజ్ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ అన్ని జిల్లాల మత్స్యకారుల ఆధ్వర్యంలో బుధవారం శాంతినగర్‌లోని మత్స్యభవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం వంద శాతం చెరువుల్లో చేపపిల్లలను వదిలినట్టు గుర్తుచేశారు.బాలు, వెంకటేశ్, జగన్, రంజిత్, రాజేశ్, రవి, ఎల్లయ్య పాల్గొన్నారు.