హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా శాస్త్రీయపద్ధతిలో కులగణన నిర్వహించాలని, రిజర్వేషన్ల శాతాన్ని పెంచడంతోపాటు కులవృత్తుల ఆధునీకరణకు సైతం ఊతమివ్వాలని బీసీ కులసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, పారిశ్రామిక రంగంలో సబ్సిడీలు, భూముల కేటాయింపు, బీసీ సబ్‌ప్లాన్, బీసీ కులాల ఉత్పత్తులకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేకమైన సెజ్‌లు, ఉత్పత్తులకు మారెటింగ్ సౌకర్యం వంటి అంశాలతోపాటు కులాల వారీగా సమస్యలను, వాటికి తాము సూచిస్తున్న పరిషార మార్గాలను అమలుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ మేరకు నేటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్న రాష్ట్ర బీసీ కమిషన్‌కు పెద్దఎత్తున వినతులు సమర్పించాలని కులసంఘాల ప్రతినిధులు పిలుపునిస్తున్నారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారు విషయంలో ఆసక్తిగల వ్యక్తులు, ప్రజా, కుల సంఘాల ప్రతినిధుల నుంచి అభ్యర్థనలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ కోసం రాష్ట్ర బీసీ కమిషన్ ఉమ్మడి పది జిల్లాల్లో నేటి నుంచి పర్యటించనున్నది. నేడు ఆదిలాబాద్, 29న నిజామాబాద్, 30న సంగారెడ్డి, నవంబర్ 1న కరీంనగర్, 2న వరంగల్, 4న నల్లగొండ, 5న ఖమ్మం, 7న రంగారెడ్డి, 8న మహబూబ్‌నగర్, 11న హైదరాబాద్ జిల్లాల్లో సంబంధిత జిల్లాల కలెక్టరేట్లలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనున్నది. నవంబర్ 11న ప్రత్యేకంగా ఎన్జీవోలు, సంస్థలు, కుల/సంక్షేమ సంఘాల కోసం, 13న సాధారణ ప్రజల కోసం విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఆసక్తిగలవారు వ్యక్తిగతంగా లేదంటే పోస్ట్ ద్వారా కమిషన్ కార్యాలయంలో కూడా అభ్యర్థనలు సమర్పించవచ్చని స్పష్టంచేసింది.