హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా త్వరలో చేపట్టనున్నజనగణనలోనే కులగణన నిర్వహించాలని, బీసీలకు ప్రత్యేక మం త్రిత్వశాఖను ఏర్పా టు చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం సీట్లను కేటాయించాలని కోరారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో గురువారం జాతీయ ఓబీసీ సెమినార్ నిర్వహించారు. సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని, రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇకనైనా బీసీ రిజర్వేషన్ల వర్గీకరణకు కమిషన్‌ను నియమించి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు సామాజిక న్యాయం చేయాలని కోరారు. ప్రతీ సామాజికవర్గానికి జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయరంగాల్లో ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య మౌలిక లక్షణమని తెలిపారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు కల్పించారు తప్ప రాజకీయరంగంలో కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 75 ఏండ్లలో 121సార్లు రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో పెట్టారు కానీ బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించే బిల్లు పెట్టలేదని మండిపడ్డారు.
ఇకనైనా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జనగణనలో కులగణన నిర్వహించాలని, క్రీమీలేయర్‌ను తొలగించాలని, ప్రత్యేక మంత్రిత్వశాఖ, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్, మస్తాన్‌రావు, పార్థసారథి, నాగరాజు, లక్ష్మీనారాయణ, ఓబీసీ నేతలు దుర్గా నరేశ్, గుజ్జ కృష్ణ, మహేశ్‌యాదవ్, ప్రసాదరావు, 36 కులసంఘాలు, 28 బీసీ సంఘాలు, 18 ఉద్యోగసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.