Supreme Court | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. గత నెల 29న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన సందర్భంగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే సీఎం రేవంత్‌రెడ్డి.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. న్యాయస్థానాల పట్ల తనకెంతో గౌరవమని, దేశ న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసమున్నదని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఈ అంశం సోమవారం మరోసారి ధర్మాసనం ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా పిటిషనర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కోర్టులు, న్యాయవ్యవస్థ పట్ల సామాజిక మాధ్యమాల్లో అనుచితంగా వ్యవహరిస్తున్నారని.. ఇందుకు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిదే పూర్తి బాధ్యత అని తెలిపారు. దీనిపై ఒక ఐఏ (ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్) దాఖలు చేశామని పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల ఫొటోలు పెట్టి ఇష్టారీతిలో సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ వివరాలు అన్ని ఐఏలో పొందుపరిచినట్టు వివరించారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ.. ఉన్నత పదవుల్లో ఉన్నవారి నుంచి కొంత సంయమని ఆశిస్తామని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కోర్టులను, లాయర్లను ఇందులోకి లాగుతున్నారు అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం హోంమంత్రిత్వశాఖ కూడాసీఎం రేవంత్ వద్దనే ఉన్నదని, ఓటుకు నోటు కేసును ముందుకు తీసుకెళ్లాల్సిన అధికారులు ప్రతిరోజు ఆయనకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వివరించారు. ఒకవేళ మరోచోటుకు మార్చినా అధికారులు ఆయనకు చెప్పిన తర్వాతే కోర్టుకు వెళతారు కదా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అప్పుడు కోర్టు అధికార పరిధి (జ్యురిస్డిక్షన్) మారుతుందని న్యాయవాదులు వివరించారు. విచారించే కోర్టు మారినా.. పరిధి మారదు, విషయం మరదని న్యాయమూర్తులు తెలిపారు. ఇప్పటికే 25 మంది సాక్షుల నుంచి అన్ని వివరాలు నమోదు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. పిటిషనర్లు దాఖలు చేసిన ఐఏకు తమ సమాధానాలు ఇవ్వాలని ప్రతివాదులను ఆశించిన ధర్మాసనం ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్‌పై విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేసింది.