హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రవాణాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 245 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు ఆర్టీఏ ఉన్నతాధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్టు తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలు, ఫిట్నెస్ లేని 60బస్సులను సీజ్ చేసినట్టు వెల్లడించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 25,987 విద్యాసంస్థల బస్సులు ఉండగా, 23,204 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయని, మిగిలిన 2,783 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.