నల్లగొండ, జనవరి 8 : తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బద్నాం చేసి జైలులో పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపన్నుతున్నాడని ఎమ్మెల్సీ కోటిరెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే దుర్బుద్ధితో ఈ-కార్ రేస్ అంశాన్ని బటయకు తీసి ఏసీబీ, ఈడీలను రంగంలోకి దింపాడని మండిపడ్డారు. బుధవారం ఆయన నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇకనైనా కుట్రలు మాని ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ చేయడంతోపాటు రైతు భరోసా ఎకరాకు రూ.7,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల్లో రైతు భరోసా రూ.7,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.6వేలకు తగ్గించటమేంటని ప్రశ్నించారు.