మహబూబాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ)/కేసముద్రం : తమ భూములకు పట్టాలివ్వాలని అడిగినందుకు తమపై కేసులు పెట్టిన మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌ను బదిలీ చేయాలని కేసముద్రం మండలం నారాయణపురం రైతులు బుధవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ సమస్యను పరిష్కరించాలని శాంతియుతంగా కలెక్టరేట్ ఎదుట ఆగస్టు 20న ధర్నా చేస్తే మహబూబాబాద్ టౌన్ పోలీసులకు కలెక్టర్ ఫోన్ చేసి 8 మంది మహిళలసహా 36 మందిపై కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే పూర్తిచేసినప్పటికీ 700 మంది రైతులకు సంబంధించిన 1100 ఎకరాల భూమికి పట్టాలివ్వకుండా కలెక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. పట్టాలు లేకపోవడంతో రైతుబీమా, రైతుభరోసా, మద్దతు ధర, విత్తనాలు, యూరియా, ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని సీఎస్‌ను కోరారు.
ఏళ్లుగా పరిషారంకాని సమస్య
కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 700 మంది రైతులకు 1100 ఎకరాల భూమి పట్టా కావాల్సిఉంది. ఆ భూమిలో 60 ఏళ్లుగా రైతులు సాగుచేసుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో 1,827 ఎ కరాల భూమిని అటవీ భూములుగా పేరొంటూ రైతులకు పట్టాలు ఇవ్వకుండా అప్పటి అధికారులు నిలిపివేశారు. 1959లోని 2384 జీవో ప్రకారం నారాయణపురంలోని భూములు 2021 ఫిబ్రవరిలో రెవెన్యూ భూములుగా తేలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాలతో 2021 జూన్‌లో ఎంజాయ్మెంట్ సర్వేచేసి 1,827 ఎకరాల్లో 633 ఎకరాలకు పట్టాదారుపాసుపుస్తకాలు ఇచ్చారు. మిగిలిన రైతులకు సంబంధించిన 1100 ఎకరాల భూమికి పట్టాలున్నప్పటికీ ధరణి పోర్టల్‌లో రైతులు, వారి తండ్రుల పేర్లకు బదులుగా సాంకేతిక కారణాలతో అడవి అని నమోదైంది. ఆన్లైన్ సేత్వార్ రికార్డుల్లో లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలలుగా అధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నా పట్టాలు రాలేదు. సీఎం, రెవెన్యూ మంత్రి, చీఫ్ సెక్రటరీ, భూ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, భూ పరిపాలన కమిషనర్లకు పలుమార్లు రైతులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యేక జీవో 94ను 2024 సెప్టెంబర్ 11న జారీచేసి సమస్యను తక్షణమే పరిషరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్‌కు పంపించారు. అయినప్పటికీ 300 ఎకరాల్లో రైతుల పేర్లకు బదులుగా ఉన్న అడవిని రికార్డుల్లో నుంచి తొలగించలేదు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో 2025 జనవరిలో 8 మంది సర్వేయర్లు, 8 మంది ఆర్ఐలు, ఇద్దరు తహసీల్దార్లు, ఆర్డీవో, జాయిం ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మరోసారి ఎంజాయ్మెంట్ సర్వే పూర్తిచేశారు. తొమ్మిది నెలలైనా పాసుప్తుకాలు ఇవ్వకుండా రేపు, మాపు అం టూ తిప్పించుకుంటున్నారు.
ఆగస్టు 20న కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌ను కలిసేందుకు 36 మంది రైతులు కలెక్టరేట్‌కు రాగా, ప్రధాన గేటు వద్దే పోలీసులు వారిని నిలిపివేశారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చి వెళ్తామని చెప్పినా పోలీసులు లోపలికి పంపించకపోవడంతో ఆగ్రహించిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 36 మంది రైతులపై 238, 321, 322 సెక్షన్ల కింద మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు. ఈ నెల 22న పోలీసులు రైతులకు ఫోన్ చేసి పూచీకత్తు కోసం రూ. 10 వేలు తీసుకొని రావాలని చెప్పడంతో వారు స్టేషన్‌కు చేరుకొని స్టేషన్ బెయిల్ తీసుకున్నారు. రైతులకు పాసుపుస్తకాలు లేకపోవడంతో పదేండ్లుగా ఏ ఒక్క పథకం వర్తించడంలేదు.
పాసు పుస్తకాలు ఇంకా ఇయ్యలే..
154 సర్వే నంబర్లో 5.05 ఎకరాల భూమి ఉన్నది. వారసత్వంగా వచ్చిన భూమికి పాత పట్టా పాస్ పుస్తకం, 1బీ ఉన్నది. కొత్త పాసు పుస్తకం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకుంటే ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించిండ్రు. ఇప్పటి వరకు పాసు పుస్తకం ఇయ్యలేదు. దీంతో ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాం. రైతు భరోసా కూడా రాలేదు.
– ధరావత్ దేవా, రైతు, రాయణపురం, కేసముద్రం మండలం