HYDRA | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్లో కబ్జా చేసి నిర్మించిన వారితోపాటు సహకరించిన అధికారులపై హైడ్రా కేసులు పెడుతున్నది. ఈ నెల 20న బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎర్రకుంట చెరువులో నిర్మాణాలు చేసిన మ్యాప్స్ ఇన్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డిపై ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కట్టడాన్ని గతవారం హైడ్రా కూల్చేసింది.
బిల్డర్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించడానికి నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, బాచుపల్లి తహసీల్దార్, మేడ్చల్ ఏడీఈ, హెచ్ఎండీఏ ఏపీవోలను నిందితులుగా చేర్చాలంటూ గురువారం హైడ్రా ఫిర్యాదు చేసింది. మదీనాగూడలోని ఎర్ల చెరువులో నిర్మాణాలు చేశారంటూ చందానగర్‌లో ఇరిగేషన్ అధికారులు మరో కేసు నమోదు చేశారు. నిర్మాణాలు చేపట్టిన స్వర్ణలత, కృష్ణకిశోర్‌పై కేసు నమోదవగా, తాజాగా చందానగర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీలను ఆ కేసులో నిందితులుగా చేర్చాలంటూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.