హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రిమాండ్కు పంపిన రైతులను వెంటనే విడుదల చేసి కేసులను ఎత్తివేయాలని తెలంగాణ రైతు సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరికొందరిని అరెస్టు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు గత 10 నెలలుగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ హామీతో రైతులు ఆందోళనను విరమించారని తెలిపారు. మళ్లీ కంపెనీ ఏర్పాటు కోసం అర్ధరాత్రి పూనుకోవడంతో రైతు కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయని పేర్కొన్నారు. కంపెనీ యాజమాన్యం తరఫున వచ్చిన బౌన్సర్లు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నదని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు యాజమాన్యం తరఫున రైతులపైనే లాఠీచార్జికి దిగడం దారుణమని తెలిపారు.