హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి వేళ ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హైవేపై తనిఖీలు చేపట్టి భారీ సంఖ్యలో కేసులు నమోదుచేశారు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే వారం రోజులుగా కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 317 కేసులు నమోదు చేసినట్టు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేశ్‌కుమార్ వెల్లడించారు.
సెంట్రల్‌జోన్ పరిధిలో ట్యాక్స్‌లు చెల్లించని, నిబంధనలకు విరుద్ధంగా నడిపిన 43 బస్సులు, ఈస్ట్‌జోన్‌లో 50, వెస్ట్‌జోన్‌లో 30, నార్త్‌జోన్‌లో 48, సౌత్జోన్లో 72 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదుచేసినట్టు వివరించారు. నాగోల్ డ్రైవింగ్ టెస్ట్‌ట్రాక్ పరిధిలో వాణిజ్య ఉత్పత్తుల రవాణా, ఫైర్‌సేఫ్టీ లేని, డ్రైవర్లకు యూనిఫాం లేని బస్సులకు సంబంధించి 74 కేసులు నమోదుచేసినట్టు తెలిపారు. వీరి నుంచి రూ.1,11,000 పెనాల్టీ వసూలు చేసినట్టు చెప్పారు. మేడ్చల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో 415 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేసినట్టు రవాణాశాఖ అధికారులు తెలిపారు.