సంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేయాలని జాతీయ మానవహక్కుల కమిషన్ను మంగళవారం ఆశ్రయించారు. ఆ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుల మృతికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని రామరావు కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ఆ పరిశ్ర మ యజమానులపై హత్యకేసుగా నమోదు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మృతులకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ను ప్రతివాదిగా చేర్చారు. తెలంగాణలోని పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీని న్యాయవాది ఇమ్మానేని రామారావు కోరారు. ఎన్హెచ్ఆర్ తన పిటిషన్ను విచారణకు స్వీకరించి కేసు నమోదు చేసినట్టు చెప్పారు.