హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘మంచు’ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇంటి గొడవలు కాస్తా పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. దీంతో మంగళవారం జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మోహన్‌బాబు కుమారులు విష్ణు, మనోజ్ తరఫున రంగంలోకి దిగిన బౌన్సర్లు బాహాబాహీకి దిగారు. బౌన్సర్ల సాయంతో మనోజ్ గేట్లు బద్దలుకొట్టి మరీ ఇంట్లోకి వెళ్లారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మోహన్‌బాబు జర్నలిస్టులపై దాడికి పాల్పడటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మరోవైపు పరస్పర ఫిర్యాదుల మేరకు మోహన్‌బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్‌పై పహాడీషరీఫ్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి.
ప్రైవేటు సైన్యాన్ని దింపిన అన్నదమ్ములు
తండ్రీకొడుకులు సోమవారం పరస్పరం రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఉదయం జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి పహడీషరీఫ్ పోలీసులు చేరుకున్నారు. ఆదివారం జరిగిన గొడవకు సంబంధించి ఇంట్లో పనిచేసే వారిని విచారించారు. ఆ తర్వాత మోహన్‌బాబు, మనోజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నానికి దుబాయ్ నుంచి వచ్చిన విష్ణు.. తన బౌన్సర్లను వెంటబెట్టుకొని నేరుగా జల్పల్లి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న మనోజ్ బౌన్సర్లను విష్ణు బయటకు పంపించే ప్రయత్నం చేయడంతో విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. మనోజ్ సామాగ్రిని ఖాళీ చేయించేందుకు డీసీఎంలను కూడా సిద్ధం చేశారు.
జర్నలిస్టులపై మోహన్‌బాబు దాడి
తాజా పరిణామాలపై మంగళవారం సాయంత్రం డీజీపీ, ఇంటలిజెన్స్ డీజీలను మనోజ్ కలిసి ఫిర్యాదు చేశారు. తిరిగి జల్పల్లి ఇంటికి చేరుకోగా గేట్లు తీయలేదు. ఇంట్లో ఉన్న తన కూతురిని తీసుకెళ్తానంటూ గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. దీంతో విష్ణు తరఫు బౌన్సర్లు మనోజ్‌ను, మీడియాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో మోహన్‌బాబు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మనోజ్‌పై చేయి చేసుకున్నారు. మీడియా ప్రతినిధులను దూషిస్తూ, తుపాకీ బయటకు తీసి చంపేస్తానని హెచ్చరించారు. మైక్ ముందుపెట్టి ప్రశ్నించే ప్రయత్నం చేసిన రంజీత్ అనే జర్నలిస్టు వద్ద నుంచి మైక్ లాక్కొని అతడిపైనే దాడి చేశారు. బౌన్సర్లు సైతం దౌర్జన్యం చేయడంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. తర్వాత మోహన్‌బాబు అస్వస్థతకు గురికావడంతో స్థానిక దవాఖానకు తరలించారు.
పోలీసుల ప్రేక్షకపాత్ర
మోహన్‌బాబు ఇంటి వద్ద ఇంత తతంగం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఇరువైపులా బౌన్సర్లు ఘర్షణకు దిగినా, మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడినా అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నించలేదు. ఉదయమంతా పోలీసులు మోహన్‌బాబుకు అనుకూలంగా వ్యవహరించారని, మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్లి వచ్చిన తరువాత పోలీసుల వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, మోహన్‌బాబు, మనోజ్‌ల వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకులను వెనక్కి తీసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.
మోహన్‌బాబు ఇంటి వద్ద జర్నలిస్టుల ఆందోళన
మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడికి పాల్పడటాన్ని నిరసిస్తూ జల్పల్లిలోని ఆయన ఇంటి ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ‘మోహన్‌బాబు డౌన్ డౌన్’ ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. మీడియా ప్రతినిధులపై దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్షుడు మామిడి సోమయ్య, డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తదతరులు జర్నలిస్టుపై దాడిని ఖండించారు. మోహన్‌బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మోహన్‌బాబుకు నోటీసులు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంచు కుటుంబ గొడవలను ఎట్టకేలకు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అదనపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు మనోజ్, విష్ణుకు నోటీసులు జారీ అయ్యాయి.
మనోజ్.. గుండెల మీద తన్నావు: మోహన్‌బాబు
కుటుంబ గొడవలపై మోహన్‌బాబు ఆడియో విడుదల చేశారు. ‘నిన్ను అల్లారుముద్దుగా పెంచాను, చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను, భార్య మాటలు విని నా గుండెలపై తన్నావు. తాగుడుకు అలవాటు పడి చెడుమార్గంలో వెళ్తున్నావు. ఇంట్లో అందరినీ ఎందుకు కొడుతున్నావు? బతుకుదెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహా పాపం. నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి. అన్నతో పాటు వినయ్‌ని కొట్టడానికి వచ్చావు. నీ అన్నను చంపుతాననని అన్నావు. నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. రోడ్డుకెక్కి నా పరువు తీశావు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా? వద్దా? అనేది నా ఇష్టం. జరిగిన సంఘటనతో మీ అమ్మ దవాఖానలో చేరింది. పోలీసుల సమక్షంలో నీ బిడ్డను నీకు అప్పగిస్తా’ అని మనోజ్‌ను ఉద్దేశించి మోహన్‌బాబు పేర్కొన్నారు. మనోజ్ తనను కొట్టలేదని, ప్రతీ ఇంట్లో గొడవలు ఉంటాయని అన్నారు.