హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలపై పెడుతున్న అక్రమ కేసులకు బెదిరేది లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టంచేశారు. చట్టాలకు, నిబంధనలకు లోబడి పోలీసులు వ్యవహరించాలే తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తే కేసులు పెట్టడం సరికాదని సూచించారు. గురువారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు రావుల శ్రీధర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల దృష్టిని మళ్లించి తద్వారా రాజకీయ లబ్ధిపొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్దేశపూర్వంగా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపైనే కాకుండా సాక్షాత్తు తనపై, తన కుటుంబసభ్యులపై నియోజకవర్గంలోని ఓ రౌడీషీటర్‌తో ప్రైవేటు ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేయించారని ఆరోపించారు.
భూపాలపల్లిలో ఆలయం కడితే ప్రస్తుత ఎమ్మెల్యే ఒత్తిడితో తనకు నోటీసులిస్తే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామని చెప్పారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్అండ్బీ అతిథి గృహం, ఆలయం అన్నీ ఒకే సర్వే నంబర్లో ఉన్నాయని వివరించారు. గుడిని ఆనుకునే ఆలయ అవసరాల కోసం నిర్మించామని, అది ఆలయం ఆస్తి తప్ప తన సొంత ఆస్తి కాదని చెప్పారు. ప్రభుత్వ భూమిలోనే గుడి కట్టామని వివరించారు. తనపై కేసులు పెట్టి జైలుకు పంపినా వెళ్తామే కానీ, భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు.
కోర్టు ఆదేశాలతో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి సహా ఏడుగురిపై బుధవారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై సంధ్యారాణి తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని పుల్లూరి రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, సెగ్గం సిద్ధు, కొత్త హరిబాబు, గండ్ర హరీశ్రెడ్డిపై కేసు నమోదైనట్టు ఆమె పేర్కొన్నారు.