హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా రాష్ట్ర డీజీపీ జితేందర్ సహా పలువురు ఉన్నతాధికారులు రూ.300 కోట్ల ముడుపులు స్వీకరించారని ‘ప్రపంచ యాత్రికుడు’ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు అన్వేష్ సంచలన ఆరోపణ చేశారు. బెట్టింగ్ యాప్స్‌పై రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ డీజీపీతోపాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి, దానకిశోర్, వికాస్‌రాజ్ తదితరులు మెట్రో రైళ్లలో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేసేందుకు అంగీకరించారని, బెట్టింగ్స్ యాప్స్ నిర్వాహకుల నుంచి వారు భారీగా ముడుపులు స్వీకరించడం వల్లే ఇదంతా జరిగిందని తన చానల్లో పేర్కొన్నారు. దీన్ని గుర్తించిన సైబరాబద్ సోషల్ మీడియా సెల్ హెడ్ కానిస్టేబుల్ ఏ నవీన్ కుమార్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ తదితర అధికారులపై అన్వేష్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అన్వేష్‌పై కేసు నమోదు చేసిన సైబర్‌క్రైం పోలీసులు.. అతని వివాదస్పద వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించారు.