మహదేవపూర్, ఆగస్టు 6 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మా జీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణరెడ్డిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూలై 26న కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సోషల్ మీడియా కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌పై అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగరేసి చిత్రీకరించారని ఇరిగేషన్ శాఖ అధికారులు అభియోగంమోపారు. వారి ఫిర్యాదు మేరకు మహదేవపూర్ పోలీసులు జూలై 29న కేటీఆర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణరెడ్డిపై సెక్షన్ 223(బీ) కింద కేసు నమోదు చేశారు. వీరితోపాటు నాయకులు, కార్యకర్తలనూ జోడించారు.