జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 29: జానపద సింగర్, రైటర్ మల్లిక్‌తేజ తనపై లైంగికదాడికి యత్నించాడని సహచర గాయని ఆదివారం జగిత్యాలలోని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా చిన్నాపూర్కు చెందిన సింగారపు మల్లేశం అలియాస్ మల్లిక్తేజతో కలిసి ఆరేండ్ల క్రితం ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించి పాటలు పాడుతున్నామని, చాన ల్ మంచి ఆదరణ పొంది లక్షల వ్యూస్ రావడంతో ఆదాయం సైతం భారీగా వచ్చేదని తెలిపింది. తనకు కొంత నగదు మాత్రమే ఇవ్వడంతో మరో యూట్యూబ్ చానల్ ప్రారంభించానని, తనకు తెలియకుండానే యూట్యూబ్ చానల్ పాస్వర్డ్, 2 లక్షల వ్యూస్ ఉన్న ఇన్స్టాగ్రామ్ పాస్‌వర్డ్‌లను సైతం మార్చి వేధించాడని, తరచూ ఫోన్‌చేసి పెండ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని పేర్కొన్నది. జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయానికి వచ్చి లైంగికదాడికి యత్నించాడని, తనపై స్వగ్రామంలో దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నాడని మహిళా సింగర్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మల్లిక్తేజపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ధర్మపురి రూరల్, సెప్టెంబర్ 29: దుర్గామాత మాలాధరణ కోసం గోదావరిలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు ఆదివారం వరదలో కొట్టుకుపోయారు. గమనించిన జాలర్లు ఇద్దరిని కాపాడగా.. ఒకరు గల్లంతయ్యారు. దసరా నవరాత్రుల సందర్భం గా దుర్గామాత మాలధారణ కోసం జగిత్యాల జిల్లా రాయపట్నం వద్ద గోదావరి నదిలో పుణ్యస్నానం చేసేందుకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన రాగుల పవన్‌కుమార్, స్నేహితులు కొట్టె నవిత్వర్మ, బొగే అశ్విన్ కలిసి ద్విచక్రవాహనంపై వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గోదావరి నదిలో స్నానం చేస్తుండగా.. వరద ఉధృతంగా ప్రవహించడంతో ముగ్గురు కొట్టుకుపోయారు. వెంటనే అకడున్న జాలర్లు గమనించి కొట్టె నవిత్వర్మ, బొగే అశ్విన్‌ను కాపాడారు. రాగుల పవన్‌కుమార్ కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పవన్‌కుమార్ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ధర్మపురి ఎస్సై గంగుల మహేశ్ తెలిపారు.