హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్ మలాజ్‌గిరి జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే జోక్యం చేసుకు ని మినీ ట్రయల్ నిర్వహించేలా ఆదేశించమని చెబుతూ.. ఈటల దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విచారణను చట్టప్రకారం కచ్చితంగా నిర్వహించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. ఏకశిలానగర్‌లో సామాన్యుల భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటల గత జనవరిలో పేరొన్నారు. ఆ భూమిని పరిశీలించేందుకు వెళ్లిన ఆయన, ఓ రియల్ఎస్టేట్ వ్యాపారిని కొట్టారు. దానిపై వాచ్‌మన్ ఉపేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టిన కేసని తెలిపారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని పీపీ పల్లె నాగేశ్వర్రావు చెప్పారు. పీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి కేసు కొట్టివేసేందుకు నిరాకరించారు.