హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనమైందని, అప్పు పుట్టడంలేదని, ఎవరూ నమ్మడంలేదనీ వేదిక ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇదే ప్రసంగం చేస్తున్నారు. ఆ మధ్య సచివాలయ ఉన్నతాధికారులు కూడా పొదుపు సూత్రాలు, వాటి ప్రాధాన్యతపై మంచి మంచి సుభాషితాల ప్రకటనలు చేశారు. ఉద్యోగులు ఆఫీస్‌లలో లైట్లు, ఫ్యాన్ల విషయంలో పొదుపు పాటించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదేశాలు కూడా ఇచ్చారు. కానీ ఇవన్నీ ప్రచారం కోసమేనని, వాస్తవంగా సర్కారు పనితీరు భిన్నంగా ఉందని ఉద్యోగుల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. నీటిపారుదలశాఖలో జరుగుతున్న ఓ వింత తతంగమే ఇందుకు నిదర్శనమని ఉద్యోగులు మండిపడుతున్నారు.
గతంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారికి సంబంధితశాఖ అధికారులు నియామకపత్రాలు అందజేసేవారు. అరుదుగా సంబంధితశాఖ మంత్రి ఆధ్వర్యంలో పత్రాలు ఇచ్చేవారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు పనిలో చేరిపోయేవారు. కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం చిన్నదైనా, పెద్దదైనా, ఏ నియామకపత్రమైనా సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగానే ఇవ్వాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో నీటిపారుదలశాఖలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామకపత్రాలు అట్టహాసంగా ఇవ్వాలని నిర్ణయించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వీలుకాలేదనే కారణాలతో ఐదుసార్లు వాయిదా వేశారు.
నియామకపత్రాలను అందివ్వకుండా అభ్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ సర్కారు, మరోవైపు లక్షల్లో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈ, జేటీవో అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత కోసం ఏప్రిల్ 28న జలసౌధలో టెంట్, కుర్చీలు ఏర్పాట్లు చేశారు. వీటికి రోజుకు దాదాపు రూ.లక్ష ఖర్చవుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కార్యక్రమం వాయిదా వేస్తూ ప్రజాధనం వృథా చేయడం విడ్డూరమని ఇరిగేషన్‌శాఖ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే 10 రోజులు గడవగా రూ.10లక్షల ఖర్చు మీదపడినట్టు తెలిపారు.
ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 14న నియామకపత్రాలను అందజేసేందుకు ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా అందజేయాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత కార్యక్రమాన్ని 28వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ మే 2వ తేదీకి, 5వ తేదీకి అంటూ దాటవేస్తూ వచ్చారు. మే 7న జలసౌధలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాల అందజేత తప్పనిసరిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఎంపికైన అభ్యర్థులందరూ బుధవారం ఉదయమే జలసౌధకు తరలివచ్చారు. సాయంత్రం వరకు పడిగాపులుకాశారు. చివరికి ఇరిగేషన్‌శాఖ అధికారులను సంప్రదించగా కార్యక్రమం వాయిదాపడిందని చెప్పడంతో అభ్యర్థులు తీవ్రఅసహనం వ్యక్తంచేశారు. ఇప్పటికే కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని, పిలిచిన తర్వాత కార్యక్రమం వాయిదా పడితే కనీసం సమాచారం కూడా ఇవ్వరా అని మండిపడ్డారు.
నీటిపారుదలశాఖలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌కు సంబంధించి 833 పోస్టుల భర్తీకి 2022లో బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో నీటిపారుదలశాఖకు సంబంధించి(ఏఈలు సివిల్-142, మెకానికల్-35, ఎలక్ట్రికల్-50, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు-212) 439పోస్టులు ఉన్నాయి. పోస్టుల భర్తీకి నిరుడు అక్టోబర్‌లో రాతపరీక్ష నిర్వహించారు. ఈ ఫిబ్రవరిలో ఫలితాలను వెల్లడించారు. ఇరిగేషన్‌శాఖలోని ఏఈ, జేటీవో పోస్టులకు 437 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. మార్చి 5న, 6న 400 మందికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేశారు. వారికి నియామక పత్రాలను అందజేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు నియామకపత్రాలను ఇవ్వకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రేపూమాపు అంటూ కాలయాపన చేస్తున్నది.