బంజారాహిల్స్, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో క్యాన్సర్ రోగులకు అవసరమైన కీమో, రేడియోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రెనోవా మల్టీ స్పెషాలిటీ దవాఖాన నూతనంగా ఏర్పాటుచేసిన రెనోవా ఆంకాలజీ బ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం ప్రభుత్వం ఏటా ఆరోగ్యశ్రీ కింద రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్యాన్సర్ వ్యాధి ప్రబలుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో పడకల సంఖ్యను 750కి పెంచుతున్నట్టు వివరించారు.
క్యాన్సర్ రోగుల పట్ల ఆత్మీయంగా వ్యవహరించాలని, నైతిక విలువలు, సేవాభావంతో పనిచేయాలని వైద్యులకు సూచించారు. హైదరాబాద్‌లో మెడికల్ టూరిజం పెరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా అత్యాధునిక వసతులతో దవాఖానలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కే వినయ్‌కుమార్, రెనోవా దవాఖాన చైర్మన్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్‌రావు, డైరెక్టర్లు డాక్టర్ పీఎస్ దత్తాత్రేయ, డాక్టర్ అజయ్ అగర్వాల్, డాక్టర్ రోజాకిరణ్ పాల్గొన్నారు.