హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్నది. చాపకింద నీరులా ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. రాష్ట్రంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో హనుమకొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని, ఆ జిల్లాలోని ప్రతి లక్ష మంది జనాభాలో 79 కేసులు నమోదవుతున్నాయని ‘క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ’ సర్వే నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత 72 కేసులతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచినట్టు తెలిపింది. ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద గత ఐదేండ్లలో 14.9 లక్షల మంది క్యాన్సర్ చికిత్స పొందినట్టు పేర్కొన్నది. 2022 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు ‘ఆరోగ్యశ్రీ’ కింద అందిన సర్జికల్, రేడియేషన్, మెడికల్ ఆంకాలజీ, స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్టు తెలిపింది. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 1,00,294 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, బాధితుల్లో మహిళలు 59,994 (60 శాతం) మంది, పురుషులు 40,300 (40 శాతం) మంది ఉన్నారని వెల్లడించింది. రాష్ట్రంలో ఏటా సగటున 18,235 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 52 మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రతి లక్ష మంది మహిళల్లో 62 మంది, పురుషుల్లో 42 మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్టు పేర్కొన్నది. హైదరాబాద్‌లోని ప్రతి లక్ష మంది మహిళల్లో 81 మంది, పురుషుల్లో 63 మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో సగటున ప్రతి లక్ష మందిలో 45కుపైగా, కేవలం 4 జిల్లాల్లో మాత్రం 40 కంటే తక్కువగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు వెల్లడించింది.
‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద 2020-21లో రాష్ట్రవ్యాప్తంగా 15,635 మందికి క్యాన్సర్ చికిత్సలు అందించగా.. 2022-23 నాటికి ఈ సంఖ్య 29,091కి చేరింది. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం రూ.89 కోట్ల నుంచి రూ.179 కోట్లకు పెరిగింది. 2025-26లో 19,665 మంది క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం రూ.171 కోట్లు వెచ్చించింది. రాష్ట్రంలోని 30-49 ఏండ్ల వయసు మహిళల్లో 4% మంది మాత్రమే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటున్నారని, వారిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటున్నది కేవలం 0.3% మందేనని ‘ది తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్-2026’ పేరిట ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీంతో క్యాన్సర్ స్క్రీనింగ్ విషయంలో ఆలస్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్రామ స్థాయిలోనే స్క్రీనింగ్ సెంటర్లతోపాటు మొబైల్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. తద్వారా సెర్వికల్, రొమ్ము క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని చెప్తున్నారు.
