హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్డ్ ప్రాంతంలో భూసేకరణ కోసం రైల్వేశాఖ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్‌కు ముం దు గ్రామసభను నిర్వహించాలన్న నిబంధనను అమలు చేయలేదని తప్పుపట్టింది. భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 41(3) ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో విధిగా గ్రామసభ అనుమతి పొందాలని తేల్చి చెప్పింది. మణుగూరు రైల్వే స్టేషన్ నుంచి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వరకు రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ జరిపేందుకు 2019 జూన్ 16, 19న భద్రాచలం సబ్‌కలెక్టర్ జారీచేసిన నోటిఫికేషన్లను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ బుధవారం విచారణ జరిపారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. భూసేకరణ నోటిఫికేషన్‌కు ముందు విధిగా గ్రామసభ అనుమతి పొందాలన్న నిబంధనను అమలు చేయలేదని, ఆ నోటిఫికేషన్ జారీ తర్వాత వినతిపత్రం అందజేసినా అధికారులు పట్టించుకోలేదని వివరించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇప్పు డు నోటిఫికేషన్‌ను రద్దుచేస్తే రైల్వే లైన్ నిర్మాణ పనులు జాప్యమవుతాయేమోనని వ్యాఖ్యానించింది. దీంతో భూసేకరణకు చట్ట ప్రకారం చర్య లు చేపట్టనప్పుడు నోటిఫికేషన్‌ను రద్దు చేయక తప్పదని బదులిచ్చారు. పిటిషనర్లను సంప్రదించి, వారి సమ్మతితో భూసేకరణ చేపట్టేందుకు అధికారులకు అనుమతి ఇచ్చిన హైకోర్టు.. ఈ పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది. దిండి ప్రాజెక్టు కోసం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి పంచాయతీలోని కేశ్య తండాలో భూసేకరణకు వెలువరించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను, మేడారంలో వీఐపీ గెస్ట్‌హౌస్ నిర్మాణ నోటిఫికేషన్‌ను ఇటీవల హైకోర్టు రద్దు చేసింది.