హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన ఒక టీవీ చానల్ ఎండీ ఏ శ్రవణ్‌కుమార్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తామని, శ్రవణ్ పోలీసులకు లొంగిపోయాక విచారణ చేయవచ్చు కదా? అని హైకోర్టు పోలీసులకు ఒక ప్రతిపాదన చేసింది. శ్రవణ్‌కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగిసిన దశలో హైకోర్టు జోక్యం చేసుకుని, నిందితుడికి బెయిల్ మంజూరు చేసి కోర్టులో లొంగిపోవాలని ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది. ఈ విధంగా జరిగితే పిటిషనర్ శ్రవణ్‌కుమార్ లొంగిపోతే న్యాయవాది సమక్షంలో విచారణ చేపడతారా?
అని పోలీసుల తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ప్రశ్నించింది. దీనిపై పీపీ పల్లె నాగేశ్వర్రావు స్పందిస్తూ.. హైకోర్టు సూచనపై కేసు దర్యాప్తు అధికారుల వివరణ తీసుకుని శుక్రవారం చెప్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావు మధ్యంతర బెయిల్‌ను డిసెంబర్ 4 వరకు పొడిగిస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసిన కారణంగా భుజంగరావు బెయిల్ పిటిషన్‌పై ఇకడి విచారణను వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. హెల్త్గ్రౌండ్స్పై గతంలో ఇచ్చిన బెయిల్‌ను పొడిగించేందుకు కింది కోర్టు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.