హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలతోపాటు క్యాంపస్ ప్లేస్మెంట్లను సైతం ఏర్పాటుచేసి ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. ఆ దిశగా తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల విద్యాలయాల సొసైటీ కీలక అడుగు వేసింది. మాస్ మ్యూచువల్ ఇండియా సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది. హైదరాబాద్ బేగంపేటలోని సంస్థ కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంవోయూపై ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, మాస్ మ్యూచువల్ ఇండియా సంస్థ ప్రతినిధులు సంతకం చేసి పరస్పరం పత్రాలను మార్చుకొన్నారు.
ఒప్పందంలో భాగంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్మెంట్లు, సిల్డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాలను అందించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. అణగారిన బాలికలు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలనే దృక్పథంతో సీఎం కేసీఆర్ మహిళల కోసం ప్రత్యేకంగా 45 డిగ్రీ గురుకుల కాలేజీలను మంజూరు చేశారని వివరించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు గురుకుల విద్యార్థులకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను కల్పిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలతో సహకరించేందుకు ముందుకు వచ్చిన మాస్ మ్యూచువల్ ఇండియా సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. మాస్ మ్యూచువల్ ఇండియా హెడ్ రవి తంగిరాల మాట్లాడుతూ.. కొత్తగా రిక్రూటయిన ఉద్యోగులు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఓఎస్డీలు ఐశ్వర్య చకిలం, డాక్టర్ పావని తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌పై అసత్య ప్రచారాలు సరికాదు: కొప్పుల
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రి లాంటి వారని, ఆయనపై అసత్య ప్రచారాలు మానుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కేసీఆర్ గురువారం రాత్రి నిర్వహించిన ప్రెస్మీట్లో తండ్రి హోదాలో మంత్రులను ఒక వైపు, ఎమ్మెల్యేలను ఓ వైపు కూర్చోవాలని చెప్పారని, ఇందులో భాగంగానే ఎమ్మెల్యేల వరుసలో ఉన్న తనను మంత్రుల వైపు రావాల్సిందిగా సీఎం సూచించారని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు. కానీ ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంత్రికి, దళిత సమాజానికి అవమానం జరిగిందనేలా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇలాంటివి మానుకోవాలని హితవుపలికారు. పార్టీ అనేది ఒక కుటుంబమని, సీఎం కేసీఆర్ తండ్రిలా సంబోధించారని వివరించారు. అదీగాక సహచర మంత్రి హరీశ్‌రావు నా కోసం పకకు జరిగి కుర్చీ ఇచ్చారని, ఇది కూడా ప్రతిపక్షాలు గమనించాలని చురకలంటించారు. జరిగిన సంఘటనలు పూర్తిగా తెలుసుకోకుండా ఎవరికి వారు తమకు అనుకూలంగా ఊహించుకొంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇకనైనా బురద చల్లే రాజకీయం మానుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.