Telangana | తెలంగాణ ఎన్నికల నామినేషన్లకు సమయం ఆసన్నమవుతున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. కొన్నిచోట్ల ఎవరు బరిలోకి దిగుతున్నారో తేలనప్పటికీ.. అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారంతా ప్రచార పర్వంలోకి దిగారు. సమయం తక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు చేస్తున్న ఇంటింటి ప్రచారం కాస్త రథమెక్కింది. ఇకపై ఊరూవాడ, పల్లేపట్టణం అనే తేడా లేకుండా ప్రచారం ఊపందుకోనున్నది. పార్టీల జెండాలు రెపరెపలాడబోతున్నాయి. మైకుల మోతలతో ప్రచారం హోరెత్తనున్నది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావాలంటే ఏ పార్టీకైనా ప్రచార రథాలే కీలకం. అందుకే ఆయా పార్టీల అభ్యర్థులు తయారీ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రచార రథాలకు డిమాండ్ పెరిగింది. కార్పెంటర్లు, ఫ్లెక్సీ డిజైనర్లు, ఆర్టిస్ట్‌లు వాటి తయారీలో బిజీ అయ్యారు. ఎన్నికల పుణ్యమాని రెండు చేతులా పని దొరికిందంటున్నారు తయారీదారులు.
ఓటర్లను ఆకట్టుకునేలా అభ్యర్థులు ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. ఆకర్షణీయమైన ప్రచార రథాలను తయారు చేయించుకుంటున్నారు. టెక్నాలజీ పెరగడంతో ఈ రథాల రూపురేఖలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. డిజిటల్ ఫ్లెక్సీలను రథాలకు అమరుస్తున్నారు. ప్రధాన పార్టీలు, చిన్న పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు వీటిని సిద్ధం చేయించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి, అంబర్‌పేట, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని తయారీ కేంద్రాల బాటపట్టారు.
అభ్యర్థుల అభిరుచులకు తగ్గట్టుగా అశోక్‌లేలాండ్, టాటా ఏస్, డీసీఎం, గూడ్స్ ఆటోలకు సరికొత్త హంగులను జోడించి ప్రచార రథాలుగా మారుస్తున్నారు. పార్టీ గుర్తులు, సంక్షేమ పథకాలు, నాయకుల పేర్లు కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. ఒక్కో అభ్యర్థి మూడు, నాలుగు వాహనాలను సిద్ధం చేయించుకుంటున్నారు. వీటితో పాటు ఫ్లెక్సీలు, కండువాలు, జెండాలు, టోపీలు, టీషర్టులకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నది.
… మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి