హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ‘హలో.. నేను సీఎంవో నుంచి మాట్లాడుతున్నా. మీ కాలేజీలో బీటెక్ సీఎస్ఈ మేనేజ్మెంట్ కోటా సీటు కావాలి. నా పేరు చెప్పి ఫలానా విద్యార్థి వస్తాడు. చేర్చుకోండి. ఫీజుల గురించి ఎక్కడా చెప్పొద్దు. మా వాళ్లు వచ్చి ఫీజులు కట్టేస్తారు’ ఇది రాష్ట్రంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలను ఓ ముఠా బెదిరిస్తున్న తంతు. ఏకంగా సీఎంవో పేరు చెప్పి తతంగం నడుపుతున్నారు. ‘బీ’ క్యాటగిరీ సీట్ల బిజినెస్‌కు తెరలేపారు. లక్షలకు లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు. ఈ ఫోన్లతో కాలేజీల యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రముఖుల పేర్లు చెప్పడంతో సీట్లు ఇచ్చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ముఠా వెనుక సీఎంవో అధికారుల హస్తం ఉందా.. లేక సీఎంవో పేరు చెప్పుకుని ఏదైనా ముఠా దందా సాగిస్తున్నదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో సీఎస్ఈ సీట్లకు ఎక్కడా లేని డిమాండ్ వచ్చిపడింది.
ప్రత్యేకించి మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం భారీగా డిమాండ్ నెలకొన్నది. ఎప్‌సెట్‌లో ప్రతిభచూపని వారు.. మంచి ర్యాంకు సాధించని వారు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్ని కాలేజీలు దరఖాస్తులు స్వీకరించడంలేదు. విద్యార్థులు, తల్లిదండ్రులను కాలేజీ గేట్ వద్దకు కూడా రానివ్వడంలేదు. తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఈ ముఠా ‘బీ’ క్యాటగిరీ దందాకు తెరలేపింది. ఓ ప్రధాన నేత పుత్రరత్నం, సర్కారు వారి సలహాదారు పీఏలిద్దరు మొత్తం దందా నడుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఏపీలో బలమైన సామాజికవర్గానికి చెందిన సదరు సలహాదారు పీఏ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు ఫోన్లుచేసి సీట్ల కోసం ఒత్తిడి తెస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ ముఠా ఇప్పటి వరకు 750 సీట్లను విక్రయించినట్టు సమాచారం.
ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ హస్తం..
ఈ దందాలో ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ‘బీ’ క్యాటగిరీ సీట్ల కోసం తెలిసిన వారి ద్వారా వచ్చిన వారిని ఈ కన్సల్టెన్సీ బుట్టలేసుకుంటుంది. ఆ తర్వాత తంతు ముఠా వద్దకు చేరుతుంది. తొలుత ఈ ముఠా కాలేజీలకు ఫోన్లు చేస్తుంది. బెదిరిస్తుంది. నయానో భయానో దారికి తెచ్చుకుంటుంది. ప్రముఖులు, పెద్దల పేర్లు చెప్పడంతో కాలేజీలు కూడా కిమ్మనకుండా సీఎస్ఈ సీట్లు ఇచ్చేందుకు ఓకే చెబుతున్నాయి. సీటు కన్ఫర్మ్కాగానే ఈ ముఠా విద్యార్థుల నుంచి రూ.14-16లక్షల వరకు దండుకుంటున్నాయి. కానీ కాలేజీలకు మా త్రం కన్వీనర్ కోటా ఫీజులే చెల్లిస్తున్నట్టు సమాచారం. మిగిలిన మొత్తాన్ని కన్సల్టెన్సీ, కీలక నేత పుత్రరత్నం, సలహాదారుడి పీఏ తమ జేబుల్లో వేసుకుంటునట్టు సమాచారం.
ఆన్లైన్లో భర్తీని అడ్డుకున్నదెవరు..?
ఇంజినీరింగ్ ‘బీ’ క్యాటగిరీ సీట్ల భర్తీలో అనేక అక్రమాలు జరుగున్నాయి. ఈ సీట్ల భర్తీలో మెరిట్‌ను పాటించడం లేదు. సీఎస్ఈ వంటి డిమాండ్ ఉన్న సీట్లను రూ. 14-16లక్షలకు అమ్ముకుంటున్నదాఖలాలున్నాయి. నిబంధనల ప్రకారం కాలేజీలు నోటిఫికేషన్ జారీచేయాలి. ఆయా నోటిఫికేషన్లో మైనార్టీ, నాన్ మైనార్టీ హోదా, బ్రాంచీలవారీగా మేనేజ్మెంట్, ఎన్నారై కోటా సీట్లను ప్రకటించాలి. దరఖాస్తు విధానం, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, దరఖాస్తుకు చివరి తేదీ వివరాలను పేర్కొనాలి. యాజమాన్యాలు ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో వచ్చే దరఖాస్తులన్నింటిని స్వీకరించాలి. దరఖాస్తుదారులకు ధ్రువీకరణ (అక్నాలెడ్జ్) అందించాలి. ప్రతి కోర్సుకు ఎన్నారై, జేఈఈ మెయిన్, ఎంసెట్ ర్యాంకు, ఇంటర్ మార్కుల పర్సంటెజీ ఆధారంగా మెరిట్ జాబితాలను సిద్ధం చేసి, వెబ్సైట్లో, నోటీసు బోర్డులో పొందుపరచాలి. కానీ ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ దందాకు ముగింపు పలికేందుకు ‘బీ’ క్యాటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీచేయాలని ఉన్నత విద్యామండలి ఏడాది క్రితం మూడు రకాల ప్రతిపాదనలను సర్కారు ముందుంచింది. కానీ సర్కారు పెద్దలు ఈ ప్రతిపాదనలను అటకెక్కించారు. ఆన్లైన్లో భర్తీచేస్తే తమ జేబులు నిండవనే కొందరు దీనిని అడ్డుకున్నారా..? అన్న అనుమానాలొస్తున్నాయి.
మేం.. అన్న తాలుకా..
ఇటీవల సీట్ల కోసం చోటా మోటా లీడర్లు, సీఎం బంధువర్గం అంతా రంగంలోకి దిగారు. ఇటీవల ఓ ఆఫీస్‌లో ఓ చోటా లీడర్ తెగ హడవుడి చేశాడు. వస్తూ వస్తూనే..‘ సార్ నమస్తే.. నేను రేవంతన్న మనిషిని. అన్నను రోజు కలుస్తుంటా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఈ రోజు అన్నతో మీటింగ్ ఉండే. నేను ఒక వార్డుకు ఇన్చార్జిని. రేవంతన్నతో ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. మినిస్టర్లు కూడా మీటింగ్‌కు వచ్చారు. నేను ఫలానా కాలేజీలో ఇంజినీరింగ్ సీటు కోసం వెళితే పట్టించుకోవడంలేదు. కాలేజీలో సీటు కావాలే జర చూడండి. అంటూ మనసులో మాట బయటపెట్టేశాడు. మరో వ్యక్తి ‘సార్ మాది నాగర్‌కర్నూల్. సీఎం అన్న తిరుపతిరెడ్డి భార్య మాకు బంధువు. కావాలంటే అన్నకు ఫోన్ చేస్త మాట్లాడండి (వద్దులే అని అవతలి వైపు అధికారి). మా బాబుకు ఎప్‌సెట్‌లో లక్ష ర్యాంకు వచ్చింది. కొంచెం బాచుపల్లిలోని కాలేజీలో సీఎస్ఈ సీటు ఇప్పించండి’ అంటూ ఒత్తిడి తెచ్చారు.. కొంత కాలం క్రితం సచివాలయం లో ఉన్నతాధికారి చాంబర్లో మరో ఘటన జరిగింది. తాను రేవంతన్న పీఏ మనిషిని. అన్నతో ఫోన్లో మాట్లాడండి అంటూ ఓ అనామకుడు తన ఫోన్‌ను అధికారికి ఇవ్వగా, అతడు ఫోన్లో అధికారికి హుకుం జారీచేశాడు. తన ఫోన్లో పీఏతో మాట్లాడుతానంటూ చెప్పినా వినిపించుకోకుండా రుసరుసలాడుతూ వెళ్లిపోయాడు.
వీఎన్ఆర్’లో సీట్ల బ్లాక్ మార్కెట్
వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్(వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ) కళాశాల యాజమాన్యం ఇంజినీరింగ్ సీట్లను అమ్ముకుంటుందని బీఆర్ఎస్వీ, విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. శనివారం బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ కళాశాలలోని అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధికంగా ఒక్క వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ కళాశాలలోనే 2,500 ఇంజినీరింగ్ సీట్లు ఉండగా, వాటిల్లో 680 సీట్లను మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాకింద అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎస్ఈ దాని అనుబంధ గ్రూపుల్లోని సీట్లను లక్షల్లో దండుకుంటున్నారన్నారు. – దుండిగల్