హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ తనను కమిటీ ముందుకు పిలిచి మాట్లాడుతామన్న కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ.. ముందు పిలవాల్సింది తనను కాదని, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌ను పిలవాలని శుక్రవారం ఓ ప్రకటనలో అల్టిమేటం ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న రేవంత్‌రెడ్డిని పిలిస్తే, తాను హాజరవుతానని చెప్పారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా పార్టీ కార్యక్రమాలపై రేవంత్ ఎలా ప్రకటనలు చేస్తారని ప్రశ్నించారు. పార్టీలో చర్చించకుండా వచ్చే ఎన్నికల కోసం పెద్దపల్లి అభ్యర్థిని ముందే ప్రకటించటం క్రమశిక్షణ పరిధిలోకి రాదా? పీసీసీ చీఫ్‌పై చర్యలు తీసుకోవాలన్న విషయం చిన్నారెడ్డికి తెలియదా? అని నిలదీశారు. ఇటీవల రేవంత్‌రెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని జగ్గారెడ్డి బహిష్కరించటంతో పాటు సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై శుక్రవారం క్రమశిక్షణ కమిటీ చర్చించింది. అనంతరం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి తీరు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు. సమస్యలు ఉంటే పార్టీలో చర్చించాలని, తర్వాత అధిష్ఠానానికి, ఇన్చార్జికి లేఖలు రాయవచ్చని అన్నారు. బహిరంగంగా మాట్లాడటం, అధిష్ఠానానికి రాసిన లేఖలను బహిర్గతం చేయటం మంచిది కాదని పేర్కొన్నారు. జగ్గారెడ్డి రాసిన లేఖ ఎలా లీకవుతుందని ప్రశ్నించారు. త్వరలోనే ఆయనను కమిటీ ముందుకు పిలిచి మాట్లాడుతామని చెప్పారు. పార్టీలో కొన్ని ప్రాంతాల్లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఆయా జిల్లాల్లో పర్యటించి, నేతలతో చర్చించి సమస్య పరిషారానికి కృషి చేస్తామని చిన్నారెడ్డి పేర్కొన్నారు.