హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు ఐక్యం కావాలి. ఆస్తులను స్వాధీనం చేసుకొనే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కుట్రలను తిప్పికొట్టాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎవరి అనుమతి లేకుండానే బస్‌భవన్‌లోని ‘ఏ’ బ్లాక్‌ను స్వాధీనం చేసుకొన్న ప్రభుత్వం.. రేపు తెలంగాణకు చెందిన ‘బీ’ బ్లాక్‌ను కూడా ఆక్రమించుకోదని గ్యారెంటీ ఉన్నదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లోని ‘ఏ’ బ్లాక్‌లోని నాలుగు అంతస్తుల ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షించేందుకు శనివారం జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, ముషీరాబాద్ డిపో జేఏసీ నాయకులు ఎన్ కృష్ణ తదితరులు వెళ్లారు. ఏ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ వద్ద ఏపీకి చెందిన ఆరుగురు సిబ్బందితోపాటు ఇద్దరు ఉన్నతాధికారులు, ఒక ఏఎంటీ, ఇద్దరు ఆర్టీసీ కానిస్టేబుళ్లను బందోబస్తు పెట్టి మరీ, తాళాలు, సీల్ వేసినట్టు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన యూనియన్ నాయకుల మద్దతు వల్లే ఇకడ ఉన్నామని ఈ సందర్భంగా ఆంధ్రాకు చెందిన అధికారులు తెలిపా రు. ఈ బస్‌భవన్ నిర్మాణం కోసం ఏపీ, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చేసి పైసా పైసా పోగుచేసి నిర్మించుకున్నట్టు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు.
ఆర్టీసీ ఆస్తిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వెనకి తీసుకునే వరకు పోరాదామని ఏపీ అధికారులకు తెలంగాణ జేఏసీ నేతలు హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఏప్రిల్ 7న ‘బస్‌భవన్ బచావో’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆర్టీసీలో అన్నివర్గాల సిబ్బందికి సేవలందించే కేంద్ర కార్యాలయంగా ఈ బస్‌భవన్ రూపుదిద్దుకొన్నదని చెప్పారు. బస్‌భవన్ ముందున్న 11 ఎకరాలను ఈ ప్రభుత్వం కబ్జా చేయదని గ్యారెంటీ ఏమిటని నిలదీశారు.