Vijaya Dairy | హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): విజయ డెయిరీకి పాలు పోసే రైతులను ఆ సంస్థకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? రైతులను ప్రైవేటు డెయిరీలకు మళ్లించే కుట్ర జరుగుతున్నదా..? ఇందులో భాగంగానే పాల బిల్లులను చెల్లించడం లేదా..? విజయ డెయిరీలో, పాడి రైతుల్లో ఈ చర్చ జోరుగా జరుగుతున్నది. నిప్పులేనిదే పొగరాదన్నట్టుగా ఈ చర్చకు బలం చేకూర్చేలా ప్రభుత్వం, విజయ డెయిరీ వ్యవహారశైలి ఉన్నది. విజయ డెయిరీ కథను ముగించేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు, విజయ డెయిరీ అధికారులు తెరవెనుక భారీ ప్లాన్ వేసినట్టుగా సమాచారం.
విజయ డెయిరీ నుంచి పాడి రైతులకు బిల్లుల చెల్లింపును నిలిపివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు మూడు నెలల నుంచి రైతులకు రూ. 150 కోట్ల వరకు బిల్లులు బకాయి ఉన్నట్టుగా తెలిసింది. ఇలా బిల్లులు నిలిపివేస్తే రైతులు విసిగి వేసారి విజయ డెయిరీకి పాలు పోయడం మానేసి ప్రైవేటు డెయిరీకి వెళతారనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం విజయ డెయిరీకి సుమారు 40 వేల మంది రైతులు ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు.
రాష్ట్రంలో హెరిటేజ్ వంటి ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే సదరు సంస్థ శామీర్‌పేటలో రూ.200 కోట్లకుపైగా పెట్టుబడితో ఐస్‌క్రీం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐస్‌క్రీం తయారీకి విజయ డెయిరీ దెబ్బ తినడానికి ఏంటి సంబంధం అనే ప్రశ్న తలెత్తె అవకాశం ఉంది. ఇక్కడే అసలు కుట్ర దాగిందని చెబుతున్నారు. ఐస్‌క్రీం తయారీకి పెద్ద మొత్తంలో పాలు అవసరం. హెరిటేజ్ సంస్థకు అంత భారీ స్థాయిలో రాష్ట్రంలో పాల సేకరణ లేదు.
ఈ నేపథ్యంలో విజయ డెయిరీ వంటి సంస్థలను అడ్డు తొలిగిస్తే రైతుల నుంచి తక్కువ ధరకే పాలసేకరణ చేయొచ్చనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. దీంతో పాటు మరో సొసైటీ డెయిరీని బలోపేతం చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఓ కీలక నేత బాధ్యతలు చేపట్టి పని మొదలుపెట్టినట్టుగా తెలిసింది. తద్వారా మళ్లీ వాళ్ల పాత సామ్రాజ్యాన్ని నిర్మించుకునే దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే విజయ డెయిరీని క్రమంగా బలహీన పరిచే కుట్రలకు తెరలేపినట్టుగా పెద్దఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పాల బిల్లుల కోసం మూడు నెలల పాటు వేచి చూసి ప్రభుత్వాన్ని, అధికారులను చుట్టూ తిరిగి విసిగి వేసారిన పాడి రైతులు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26న ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో భారీ ధర్నాకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. రోడ్లపై పాలు పారబోసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు అధికారులను, నూతనంగా నియమితులైన చైర్మన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. ఎవరిని కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పోరుకు సిద్ధమయ్యారు.
నాలుగేండ్ల నుంచి విజయ డెయిరీకి పాలు పోస్తున్నా. కాంగ్రెస్ సర్కారొచ్చాక బిల్లుల కోసం రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేయల్సి వస్తున్నది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్నాం. దాణా, మినరల్ మిక్చర్, వైద్య ఖర్చులకు డబ్బులు లేక వ్యాపారం నిర్వహణకు అవస్థలు పడాల్సి వస్తోంది. బిల్లులు చెల్లించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకున్నా ఫలితం లేదు.
– ఎం.బాలరాజు, రైతు, పోమాల, నవాబ్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లా
ప్రభుత్వం పాల ఉత్పత్తిదారులకు ఇప్పటివరకు రూ. 60 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. నర్సంపేట విజయ డెయిరీ పరిధిలోని రెండు వేల మంది రైతులకు మూడు నెలలుగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. బోనస్ బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. రైతులు పశువులకు దాణా, పచ్చిగడ్డి కొనుగోలుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పాడి రైతులకు సరైన సమాధానం చెప్పలేక పోతున్నాం.
– బండి రాజ్‌కుమార్, ఇన్చార్జి మేనేజర్, విజయ డెయిరీ, నర్సంపేట, వరంగల్ జిల్లా
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక బిల్లుల కోసం కండ్లలో వత్తులేసుకొని ఎదురుచూడాల్సి వస్తోంది. గత 75రోజులుగా ఐదు బిల్లులు చెల్లించలేదు. దీంతో పశు పోషణ భారంగా మారింది. పాల బిల్లు కోసం అనేకమార్లు నిరసనలు చేశాం. ఎండీని కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వంలో చలనం రాలేదు. బిల్లులు చెల్లించి విజయ డెయిరీ రైతులను ఆదుకోవాలి.
– ఇమ్మడి శ్రీను, పాడి రైతు, లాలాపురం, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా
భైంసా ఎస్బీఐలో ముద్ర రుణం రూ.10లక్షలు తీసుకుని 16 ఆవులు, 3 బర్రెలు తీసుకొచ్చాను. పల్సిలోని విజయ డెయిరీ పాల సేకరణ కేంద్రంలో ప్రతి రోజూ 150 నుంచి 180 లీటర్ల పాలు పోస్తాను. ప్రతి నెలా నాకు రూ.30వేల ముద్ర రుణం కిస్తుతో పాటు పశువుల దాణాకు రూ.60వేలు అవసరం. మూడు నెలలుగా డబ్బులు రాక ఇబ్బందులు తలెత్తాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విజయ డెయిరీ మూతవేయక ముందే పాడి రైతులందరం కలెక్టర్ కార్యాలయాలం వద్ద నిరాహార దీక్షలకు వెనుకాడబోం.
-గుడ్డిబాయ్ దత్తాత్రి, పాడిరైతు, సిర్పెల్లి(హెచ్), కుభీర్ మండలం, నిర్మల్ జిల్లా
కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక జూలై 16వ తేదీ వరకు బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత నుంచి బిల్లుల ఉసెత్తం లేదు. మా గ్రామ సంఘంలోని 150 మంది రైతుల నుంచి ప్రతిరోజు సేకరించిన 900 లీటర్ల పాలు జహీరాబాద్‌లోని విజయ డెయిరీ కేంద్రానికి వెళ్తాయి. మా సంఘానికి పాల బిల్లులు రూ. 25 లక్షల వరకు రావాల్సి ఉంది.
– బరూర్ మాణిక్‌రెడ్డి, విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, మామిడ్గి గ్రామం, సంగారెడ్డి జిల్లా