హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 2000, 2001, 2002 సంవత్సరాలలో విడుదలైన డీఎస్సీ ద్వారా నియమితులైన వారికి, నియామక తేదీ నుంచే సీనియారిటీని లెక్కించాలని ట్రైబుల్ టీచర్స్ అసోసియేషన్ (టీటీఏ) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సంఘం జనరల్ సెక్రటరీ వీ శ్రీను పవార్, నేత హరికిషన్ చౌహాన్ మాట్లాడుతూ.. డీఎస్సీల ద్వారా ఎంపికైన ట్రైబల్ టీచర్లకు సెలవు రోజులలో కూడా 2005 వరకు శిక్షణ ఇచ్చారని, దాని ప్రకారం ఉద్యోగాలలో నియమించిన నాటి నుంచే సీనియారిటీని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఇతర బీఈడీ, టీటీసీ, టెట్ వంటి అర్హతలు లేకుండానే అప్పటి ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిందని గుర్తుచేశారు. ఈ టీచర్లకు ప్రస్తుతం చేపట్టే బదిలీలు, పదోన్నతులను కల్పించడం లేదని, అందరితోపాటు వీరికి కూడా అవకాశం కల్పించాలని కోరారు.