Police Sniffer Dog | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి మృతదేహాలను గుర్తించేందుకు కేరళ నుంచి తీసుకొచ్చిన క్యాడవర్ డాగ్స్ ఇప్పుడు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇతర రాష్ర్టాలు, నిఘా సంస్థలకు కూడా జాగిలాలకు శిక్షణ ఇచ్చి పంపిస్తున్న తెలంగాణలో.. అటువంటి డాగ్స్ లేకపోవడం చర్చనీయాంశమైంది.
‘మన ఇంటి కుక్క పసిగట్టదా?’ అంటూ పలువురు పోలీసులు ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి వెళ్లిన తెలంగాణ స్నిఫర్‌డాగ్స్ ఎలాంటి ఫలితాలు రాబట్టకుండానే తిరిగి వచ్చేశాయి. ఈ క్రమంలో కేరళ క్యాడవర్ డాగ్స్ ఇప్పటికే రెండు మృతదేహాల స్పాట్లను గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలో శిక్షణ పొందిన ఇతర జాతి జాగిలాలకు కూడా అటువంటి శిక్షణ ఇప్పించాల్సిన అవసరంపై చర్చలు కొనసాగుతున్నట్టు తెలిసింది.
క్యాడవర్ రకం జాగిలాలు ఇప్పటివరకు 95 శాతం ఫలితాలను సాధించినట్టు రికార్డులు చెప్తున్నాయి. కేరళలోని వయనాడ్‌లో ఇటీవల సంభవించిన వరదలకు బురదలో కూరుకుపోయిన వారి ఆచూకీని కనిపెట్టడంలో క్యాడవర్ డాగ్స్ ముఖ్యపాత్ర పోషించాయి. 15 అడుగుల కింద మట్టిలో, బురదలో ఉన్న మానవ శరీర అవశేషాలు, కుళ్లిన మృతదేహాలను గుర్తించి తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. ఏ జాతి జాగిలమైన దానికి ప్రత్యేకంగా శవాలను వాసనపట్టి గుర్తించడంలో శిక్షణ ఇచ్చి క్యాడవర్ డాగ్స్‌గా నామకరణం చేస్తారు. ఎన్నో పోలీస్ కేసులను పరిష్కరించిన చరిత్ర వీటికి ఉన్నది.
దట్టమైన చిట్టడువులు, చిత్తడి ప్రాంతాల్లో కూడా పనిచేయగలిగేలా వాటికి శిక్షణ ఇస్తారు. శరీర భాగాలు, అస్థిపంజర అవశేషాలు, కుళ్లిపోయే ద్రవాలతోపాటు కలుషితమైన మట్టిని గుర్తించగలవు. వైద్య పరీక్షల్లో వీటిని ఎకువగా ఉపయోగిస్తారు. తప్పిపోయిన వ్యక్తులను కనిపెట్టడంలో, హత్యకేసులో దర్యాప్తులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగిన ఘటనల్లో ఇవి ఎంతో కీలకంగా పనిచేస్తాయి.