హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : దక్షిణ డిస్కం స్టోర్‌లో ఏడాది కాలంగా చిన్న వైరు ముక్క కూడా అందుబాటులో లేదు. కీలకమైన కేబుళ్లు లేక ఏడాది నుంచి ఒక్క పని కూడా చేపట్టలేని దుస్థితి. కారణం.. మిస్టర్ టెన్‌పర్సంట్!. చిన్న వైరు ముక్క కొనుగోలు చేసినా.. అందులో టెన్ పర్సంట్ ఆయనకు సమర్పించుకోవాల్సిందేనన్న అనధికారిక షరతు. మీటరు కేబుల్‌కు రూ.3,109 చొప్పున కొనుగోలు చేయాలనే ప్రాతిపదికనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు టెండర్లను ఖరారు చేశారు. కానీ డిస్కం అధికారులు మీరు కేబుల్‌ను ఏకంగా రూ.5,200 పెట్టి కొనుగోలు చేశారు. ఇప్పటికి 42 కిలోమీటర్ల మేరకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఇకపై వందల కిలోమీటర్ల కొనుగోళ్లకు డిస్కం అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో మిస్టర్ టెన్‌పర్సంట్ ఖుషీనే కదా! అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డిస్కం కేబుళ్ల కొనుగోళ్లలో భారీ కుంభకోణానికి తెరతీయడంతో సర్కార్ సొమ్ము మిస్టర్ టెన్ పర్సెంట్ ఖాతాలోకి చేరుతున్నది. కోట్ల రూపాయలు తనకు అప్పనంగా వస్తుండటంతో ఎవరెటుపోతే నాకేంటి అన్న రీతిలో సదరు అధికారి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇంత రేటు పెట్టి కొనాల్నా? అని ఎవరైనా అడిగితే తనకు రావల్సింది వస్తే సరిపాయె.. కంపెనీ దగ్గర పైసలున్నయ్ కదా నష్టపోతే ఏమవుతుంది.. అంటూ అందరికీ షాక్ ఇస్తున్నారట.
టీజీఎస్పీడీసీఎల్లో కేబుల్ కొనుగోళ్లలో అవినీతిపై మిస్టర్ టెన్ పర్సెంట్ బాగోతాన్ని గతంలోనే నమస్తే తెలంగాణ బయటపెట్టింది. అప్పటినుంచి కొనుగోళ్లు ఆపేసి కొంత విరామం తర్వాత ఇప్పుడు భూగర్భకేబుళ్ల విధానాన్ని తెరపైకి తెచ్చి కేబుల్ కొనుగోలు చేస్తున్నారు. తమకు అనుకూలమైన రేట్లతో భారీ కుంభకోణానికి తెరదీశారు. మిస్టర్ టెన్పర్సెంట్కు దక్కాల్సింది దక్కకపోతే ఆయన కేబుల్ కొనుగోలుకు అనుమతించరంటూ ఓ ఉన్నతాధికారి సంబంధిత విభాగాల కీలక అధికారులను బెదిరించి.. తాము నిర్ణయించిన రేట్లకు అడ్డు చెప్పకుండా ఒప్పించినట్టు తెలిసింది. ఆ తర్వాత కేబుల్ కొనుగోళ్లు ప్రారంభించి.. గతంలో నిర్ణయించిన రూ.3019 కంటే మరో రూ.2181 ఎక్కువగా చెల్లించి 33 కేవీ కేబుల్‌ను మీటర్‌కు రూ.5200 చొప్పున ఓ కంపెనీ వద్ద కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఎస్పీడీసీఎల్లో కీలక అధికారి ముఖ్యపాత్ర పోషించగా మిస్టర్ టెన్‌పర్సెంట్ తప వాటాకు రావల్సింది తీసుకున్నారు.
దక్షిణ డిస్కం పరిధిలో ఓవర్‌హెడ్ లైన్లకు బదులుగా అండర్‌గ్రౌండ్ (యూజీ) కేబుల్ వేయాలని నిర్ణయించారు. కొత్త టెండర్లను పిలిచిన గత వేసవికాలం నుంచి అన్ని పనుల్లో యూజీ విధానాన్నే అమలు పరచాలని చెప్పారు. ఇందుకోసం జూబ్లీబస్‌స్టేషన్ వద్ద చార్జింగ్ పాయింట్లు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, దుండిగల్ ఎయిర్‌పోర్టుతోపాటు సమ్మర్ పనులను కూడా యూజీతో చేయాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో డిస్కం నిర్ణయించిన రూ.3,019 ధరకు కేబుల్ వేయాల్సి రావడంతో కాంట్రాక్టర్లు తామే కేబుల్ తెచ్చుకోవాలని చెప్పారు. అయితే ఇందులో తనకేమీ లాభం లేదని భావించిన సదరు అధికారి తనకు కేబుల్ కొనుగోలుపై టెన్‌పర్సెంట్ ఇస్తేనే ఒప్పుకుంటానని చెప్పడంతో పనులలో జాప్యం జరిగింది. ఈ విషయంలో డిస్కం అధికారుల మధ్య చర్చలు జరుగుతుండగానే నమస్తే తెలంగాణ ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. ఈ కమీషన్ల బాగోతం బయటకు రావడంతో సదరు టెన్‌పర్సెంట్ అధికారి కొంత వెనక్కు తగ్గారు. కేబుల్ కొనుగోలు లేకపోవడంతో జూబ్లీ బస్టాండ్ వద్ద ఓవర్‌హెడ్ వేశారు. సికింద్రాబాద్ టెండర్‌ను నిలిపివేసి కేబుల్‌తో సహా పనిచేయాలని కొత్త టెండర్ పిలిచారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనుల టెండర్‌ను ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. రూ.3019కి కేబుల్ వేస్తానని చెప్పి అగ్రిమెంట్ చేయడానికి మున్సిపల్ శాఖ నుంచి పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటివరకు డిస్కం పరిధిలో రూ.3019కే 33కేవీ కేబుల్ కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ ఆ ధర తమకు గిట్టుబాటు కాదంటూ సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. తాజాగా టీజీఎస్పీడీసీఎల్ స్వయంగా కేబుల్ కొనుగోలు చేసింది. ఇప్పుడు మాత్రం ఈ రెండు రేట్లు కాకుండా ఓ కంపెనీకి మీటర్‌కు రూ.5,200 చొప్పున చెల్లించి 42 కి.మీ.ల కేబుల్ తెప్పించింది. ప్రస్తుతం స్టోర్స్‌లో 84 డ్రమ్ములు (42కి.మీ.)వచ్చి ఉండగా, మరో వంద కిలోమీటర్ల కేబుల్‌కు ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సంవత్సరం మే నెలలో డిస్కం నిర్ణయించిన రేటుకు ఇప్పుడు తాను కొనుగోలు చేసిన రేటుకు రూ.2,181 తేడా ఉండటంతో ఈ లావాదేవీల్లో ఎంత పెద్ద ఎత్తున డబ్బులు, వాటాలు చేతులు మారాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిస్కం పరిధిలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు తామే కేబుల్ తెచ్చుకొని పనులు చేయాలన్న నిబంధన నేపథ్యంలో వారు వివిధ రాష్ర్టాల్లో ఉన్న ధరలను తెలుసుకున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌లలో రూ.3,350కే మీటర్ కేబుల్ లభిస్తున్నట్టు తెలిసింది. అయినప్పటికీ సుమారు రూ.2వేలు ఎక్కువ పెట్టి ప్రస్తుతం డిస్కం కేబుల్ కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ 42 కి.మీ. కొనుగోలులోనే ఏకంగా రూ.10 కోట్లకు పైగా కమిషన్ దక్కించుకున్న మిస్టర్ టెన్‌పర్సెంట్ అండ్ కో మరో వంద కిలోమీటర్ల కేబుల్ తెప్పిద్దామని ఆర్డర్లు పంపింది. దశలవారీగా మరో 500 కిలోమీటర్ల వరకు ఆర్డర్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు సమాచారం. తనకు ఇంత పెద్దమొత్తంలో కమీషన్ దక్కడంతో మిస్టర్ టెన్‌పర్సెంట్ ఆయనను సంతృప్తి పరిచిన ఆ డిస్కం కీలక అధికారి ఇద్దరూ ఖుషీగా ఉన్నారు.