Caste Census | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శాసనసభ తీర్మానం మేరకే సర్వే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. నివేదికను కార్యరూపంలోకి తీసుకురావడంపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, సహచర మంత్రులతో శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా చర్చించామని చెప్పారు.
నేడు, రేపు సబ్‌కమిటీ సమావేశమై లోతుగా చర్చిస్తుందని, కమిటీ అందించే నివేదికను ఈ నెల 5న మంత్రివర్గం ముందు ఎదుట పెడతామని తెలిపారు. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చకు పెట్టి, తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై సబ్‌కమిటీ తీసుకున్న చర్యలపైనా చర్చించామని తెలిపారు.