Rythu Bharosa | హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): రైతు భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనున్నది. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. దరఖాస్తుల ఆధారంగానే రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్యాబినెట్ సబ్ కమిటీ కీలక ప్రతిపాదన చేసినట్టు లీకులు ఇచ్చింది. ఇందులో భాగంగానే ప్రతి రైతు నుంచి దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. ఈ నెల 5,6,7 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి, రైతుభరోసాపై చర్చించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది.
రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? ఇందులో ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారు? ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? వంటి వివరాలను నేరుగా దరఖాస్తు ద్వారా రైతుల నుంచే తీసుకోనున్నారు. తద్వారా పంట సాగు చేసిన రైతులకు మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించారు. సబ్ కమిటీ రైతుభరోసా విధివిధానాలపై రూపొందించిన నివేదికను ఈ నెల 4న జరిగే క్యాబినెట్ సమావేశానికి అందించనున్నది. క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం విధి విధానాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నది.