GO 317 | కేబినెట్ సబ్ కమిటీ 317 జీవోపై సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సమావేశమైంది. కమిటీ సభ్యుడు, మంత్రి శ్రీధర్‌బాబు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో 317 జీవోపై స్థానికతకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ సబ్ కమిటీ ముందు ప్రతిపాదించింది. ఈ అంశాలను సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో సంప్రదించి తుది నివేదికను సబ్ కమిటీకి సమర్పించాలని ఆదేశించింది. అలాగే, జీవో46కు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించింది. సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, రిటైర్డ్ ఐఏఎస్‌లు శివశంకర్, బుసాని వెంకటేశ్వరరావు, సబ్ కమిటీ కన్సల్టెంట్, జాయింట్ సెక్రెటరీ సర్వీసెస్ జి సునీత దేవి, సహాయ కార్యదర్శి మల్లికార్జున్ ఇతర అధికారులు పాల్గొన్నారు.