హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై మంత్రుల కమిటీ ఆదివారం ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో పెట్టి ఆమోదింపజేసి గవర్నర్‌కు పంపడం, అది రాష్ట్రపతి వద్దకు వెళ్లడం, 5నెలలుగా అక్కడ పెండింగ్‌లో ఉండటం, సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం తదితర పరిణామాలను కమిటీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా సలహా ఇవ్వాల్సిందిగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయం కోరారు. ఇదే అంశంపై సోమవారం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయం సైతం తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.
నర్సంపేట సబ్ జైలర్సస్పెన్షన్ ; మహిళా ఖైదీ మృతి కేసులో..
నర్సంపేట, ఆగస్టు 24: వరంగల్ జిల్లా నర్సంపేట సబ్ జైలర్ కేఎన్ఎస్ లక్ష్మీశృతి సస్పెండ్ అయ్యారు. రిమాండ్ మహిళా ఖైదీ మృతికి కారణమంటూ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆమెపై వేటుపడింది. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. నర్సంపేట పట్టణం గాంధీనగర్‌కు చెందిన పెండ్యాల సుచరిత (37) హనుమకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసు విషయంలో ఈనెల 13న నర్సంపేటలోని సబ్‌జైల్‌కు వచ్చింది. సుచరితకు తీవ్ర కడుపునొప్పి రావడంతో జైలు అధికారులు ఆమెను ఈనెల 20న నర్సంపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లి, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అదేరోజు ఆమెకు తిరిగి జైలుకు పంపించారు. మరుసటి రోజు తెల్లవారుజామున సుచరిత అనుమానాస్పదంగా సబ్‌జైలులోనే మృతి చెందింది. ఈ క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు లక్ష్మీశృతి తీరుపై పలు అనుమానాలు వ్యక్తంచేశారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా ఆదేశాల మేరకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేయడంతో లక్ష్మీశృతిని సస్పెండ్ చేశారు.