హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : వచ్చే ఎండకాలం గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంటుందన్న నివేదికలు అందుతున్నాయని, ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎదురు తంతాయని, వర్షాలు పడే వరకు ఎన్నికలకు వెళ్లకుండా ఆగుదామని మంత్రివర్గ అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. మార్చి, ఏప్రిల్‌లో పల్లెల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని, అలాంటి సమయంలో వెళ్లి ఓట్లు అడిగితే ప్రజలు తిరగబడతారని అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇప్పటికే మిషన్ భగీరథ నీటి సరఫరాలో అవాంతరాలు 5వ పేజీలోఓటమి భయంతోనే వెనుకంజ తలెత్తుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, మార్చి, ఏప్రిల్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని సంబంధిత మంత్రి సమావేశం దృష్టికి తెచ్చినట్టు తెలిసింది.
ఇప్పటికే దాదాపు 2000కు పైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నాయని, ఏప్రిల్ నాటికి దాదాపు 5000 నుంచి 7000 గ్రామాల్లో ఉంటుందని సమాచారం సానుకూల పరిస్థితుల్లేవ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లేందుకు గ్రామాల్లో సానుకూల పరిస్థితుల్లేవని, కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కూడా గ్రామాల్లో తిరిగి రాజకీయాలు చేసే పరిస్థితి లేదని సీనియర్ మంత్రి ఒకరు వాపోయినట్టు సమాచారం. అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచలేకపోయాయని ఓ మంత్రి అభిప్రాయ పడ్డట్టు తెలిసింది. కులగణన, రైతుభరోసాపై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరిగిందని, ఉన్న సమస్యలకు తాగునీటి సమస్య కూడా తోడైతే ప్రజలు నాయకులను ఊర్లళ్లకు కూడా రానివ్వరని, ఈ సమయంలో ఎన్నికలు పెట్టి ఓట్లడగడం అతిపెద్ద సాహసమే అవుతుందన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వానలు పడే వరకు స్థానిక సంస్థల ఎన్నికల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించి, తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కార్యం పూర్తయ్యే నాటికి కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని, ఈ ఆరు నెలలు ప్రతిపక్షాల నోరు మూసినట్టు కూడా ఉంటుందని అంచనా వేసినట్టు సమాచారం.