హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయం బీసీ సమాజం కించపరిచే చర్యగా అభివర్ణిస్తూ, ప్రభుత్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ (బీపీఎఫ్) డిమాండ్ చేసింది. బీపీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో బీపీఎఫ్ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్‌గౌడ్, రాష్ట్ర కన్వీనర్ యెలికట్టే విజయకుమార్‌గౌడ్ అధ్యక్షతన నేతలు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం బీసీ హకులను అణగదొకే చర్యగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా మంత్రి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. ప్రత్యక్షంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఉత్తుత్తి జీవోలతో బీసీలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరుగనున్న ప్రజాపాలన వారోత్సవాలను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.