హైదరాబాద్, సెప్టెంబర్ 4( నమస్తే తెలంగాణ): ‘ఆర్ఆర్ ట్యాక్స్’ అంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన ఘోష్ కమిషన్ అవినీతి జరిగిందని తేల్చకున్నా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడంలోని ఆంతర్యమేమిటని గురువారం ఓ ప్ర కటనలో ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్తో కుమ్మక్కు కాలేదనుకుంటే రాష్ట్ర ప్రభు త్వ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ మోదీ జేబు సంస్థలని రాహుల్ ఆరోపిస్తున్నారని, రేవంత్ మాత్రం కాళేశ్వరంపై విచారణను తీ సుకెళ్లి మోదీ జేబులో పెట్టారని విమర్శించారు.
కవిత వ్యవహారంతో బీఆర్ఎస్ పని అయిపోయిందని కొందరు సంబురపడుతున్నారని, కానీ బీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని గుర్తుచేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్కు పట్టంకట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు.