వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/మంచిర్యాలటౌన్/చెన్నూర్/బెల్లంపల్లి టౌన్, జూన్ 30 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు హైదరాబాద్‌లో ఏర్పాట్లు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్రంలోని పలుచోట్ల ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు చర్చనీయాంశంగా మారాయి. బై బై మోదీ యాష్ టాగ్‌తో.. ‘సాలు మోదీ, సంపకు మోదీ’ అని రాసిన ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ‘రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావు, హఠాత్తుగా లాక్డౌన్ అని సామాన్యులను చంపినవ్, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాలో వేస్తానన్న 15 లక్షలు ఏవి, నాలుగు సంవత్సరాలు కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్’ అని ఫ్లెక్సీల్లో పేర్కొనడం అందరిని ఆలోచనలో పడేసింది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ తరహా నిరసనల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు గురువారం వరంగల్ మహానగరంతోపాటు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా, చెన్నూర్, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి.