నందిపేట్, జనవరి 17: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నెలాఖరులోగా రైతుబంధు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఆర్థికంగా కష్టమైనా రుణమాఫీ ప్రక్రియ కూడా చేపడతామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్రనగర్‌లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి తుమ్మల బుధవారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా రైతుల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు ఎకరాలలోపు భూమి ఉన్న 29 లక్షల మందికి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడ్డాయని తెలిపారు. మిగతా వారికి ఈ నెలాఖరులో పూర్తి చేస్తామని చెప్పారు. రూ.2 లక్షల పంట రుణం ఒకేసారి మాఫీ చేయడం ప్రభుత్వానికి కష్టమే అయినా, ముఖ్యమంత్రి ఆలోచన, పద్ధతి ప్రకారంగా కొద్దిరోజుల్లోనే రుణమాఫీ చేస్తామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తాము రైతుల అవసరం కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.