హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): అమెరికా 50శాతం సుంకాలను విధించడం వల్ల భారత్‌కు తీవ్ర నష్టం కలుగుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. అమెరికా టారిఫ్‌లకు వ్యతిరేకంగా సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో చేపట్టిన నిరసనలో పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ అమెరికా విధించిన సుంకాలతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు.
సుంకాల భారంతో విదేశాల్లో భారతీయ వస్తువులను ఎక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని తెలిపారు. ఐటీ పరిశ్రమ కుదేలవుతుందని చెప్పారు. సుంకాల విధింపుతో రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, వీరయ్య, నాగయ్య, సాగర్. అబ్బాస్, బండారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాల నుంచి భారత్ వైదొలిగే వరకు ఐక్యంగా పోరాడుతామని సంయుక్త కార్మిక కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.