హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ చెప్తున్న పొదుపు మంత్రంతో దేశాభివృద్ధి సాధ్యమవుతుందా? అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాన్య ప్రజానీకంపై తీవ్ర భారాన్ని మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్- అమెరికా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పొదుపు చర్యలు చేపట్టాలని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ గ్యాస్ ధరలు పెరగడంతో హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదమున్నదన్నారు. మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ప్రజలు పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు జీ నాగయ్య, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి, బం డారు రవికుమార్, సీనియర్ నేత డీజీ నర్సింహారావు పాల్గొన్నారు.