హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నకిలీ, కల్తీ బంగారు ఆభరణాలు కొని వినియోగదారులు మోసపోకుండా భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) నిబంధనలను మరింత కట్టుదిట్టం చేస్తున్నది. దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ప్రతి ఆభరణం శుద్ధతను పరీక్షించిన తర్వాతే ఓ ప్రత్యేక కోడ్ కేటాయించి విక్రయానికి అనుమతి ఇస్తున్నది. రాష్ట్రంలోనూ హైదరాబాద్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. బీఐఎస్ ఆమోదం లేని, హాల్‌మార్క్ ముద్రలేకుండా బంగారు ఆభరణాలు అమ్మే వారిపై చర్యలు తీసుకుంటున్నది.
బంగారం, వెండి వంటి విలువైన ఆభరణాల శుద్ధతను నిర్ధారించేందుకు భారత ప్రభుత్వం హాల్ మార్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. చిన్న దుకాణం నుంచి కార్పొరేట్ వర్తకుల దాకా ప్రతి ఒకరు ప్రతి ఆభరణంపై హాల్‌మార్క్ ముద్రించిన తర్వాతే అమ్మాలి. ప్రతి ఆభరణాన్ని తయారీదారులు దగ్గరలోని బీఐఎస్ ఆమోదిత అసేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రానికి తరలిస్తారు.
అకడ శుద్ధత పరీక్షల అనంతరం ప్రతి ఆభరణానికి బీఐఎస్ కంప్యూటర్ ఆధారిత ఐడీ నంబర్‌ను కేటాయిస్తుంది. దీన్నే హాల్మారింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్ యూఐడీ)గా పరిగణిస్తారు. బరువు, రకంతో సంబంధం లేకుండా కొనే ప్రతి ఆభరణంపై మూడు ముద్రలు (1.బీఐఎస్ లోగో, 2.ఆభరణం క్యారెట్లు, శుద్ధత, 3.హెచ్యూఐటీ నంబర్ ఆరు అంకెలు) ఉంటేనే అది హాల్‌మార్క్ బంగారంగా గుర్తించాలి.
బంగారు ఆభరణాల శుద్ధతను వినియోగదారులు స్వయంగా పరిశీలించుకొనేందుకు బీఐఎస్.. బీఐఎస్ కేర్ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో ఆభరణం నాణ్యతను తెలుసుకోవచ్చు. హాల్‌మార్కింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్న ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ జిల్లాల్లో వర్తకులు హాల్‌మార్కింగ్ లేకుండా అమ్మినట్టు బీఐఎస్ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఆ 12 జిల్లాలు ఇవే: హైదరాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, మేడ్చల్ మలాజిగిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ. ఉద్దేశపూర్వకంగా వినియోగదారులకు నష్టం కలిగించేలా బంగారు ఆభరణాల వర్తకులు హాల్‌మార్క్ లేని బంగారం అమ్మడం సెక్షన్ 14, 15 కింద నేరం. ఈ చట్టాలను ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 29 ప్రకారం ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉన్నది.
వర్తకులు కచ్చితంగా హాల్‌మార్కింగ్ నిబంధనలు పాటించాలి. పాటించనట్టు మా దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు సైతం హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలే కొనాలి. ఒకవేళ హాల్ మార్క్‌పై సందేహం ఉన్నా, ముద్ర లేదని గుర్తించినా బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయండి. ఏ ఆభరణం హాల్‌మార్కింగ్‌కు అయినా అదనంగా అయ్యే ఖర్చు జీఎస్టీతోపాటు రూ.45 మాత్రమే. ఎక్కువ వసూలుచేసినా ఫిర్యాదు చేయవచ్చు.
– పీవీ శ్రీకాంత్, డైరెక్టర్, హైదరాబాద్ బీఐఎస్ శాఖాధిపతి